దీపావళికి సందడి చేయనున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్ గ్లోబల్ మార్కెట్లో అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'రెక్స్టన్' దేశీయ విపణిలో కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళి సీజన్‌లో శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ భారతీయ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.
మహీంద్రాకు భారత్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలోనే ఈ రెక్స్టన్ ఎస్‌యూవీని కూడా నిర్మించనున్నారు. ఈ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయటానికి గాను మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1,500 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. పూర్తిగా గ్లోబల్ టెక్నాలజీతో రూపొందుకున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ను మహీంద్రా తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ దేశీయ విపణిలో మార్కెటింగ్ చేయనుంది.
ఇండియన్ మార్కెట్ కోసం శాంగ్‌యాంగ్‌తో కలిసి మూడు ఉత్పత్తులను అభివృద్ధి చేశామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ అధ్యక్షుడు పవన్ గోయెంకా తెలిపారు. వీటిలో తొలి వాహనాన్ని (రెక్స్టన్) అభివృద్ధి చేసి మార్కెట్లో తీసుకురావటానికి మూడేళ్ల సమయం పట్టిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలో వాహనాల కొనుగోళ్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు.
శాంగ్‌యాంగ్ మోటార్ కంపెనీలో మహీంద్రా అండ్ మహీంద్రాకు 70 శాతం వాటా ఉంది. 2010లో రూ.2,100 కోట్లను చెల్లించి మహీంద్రా ఈ వాటాలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు కూడా కొత్త ఇంజన్ ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయటంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు తయారు చేయనున్న వాహనాల్లో కొత్తగా అభివృద్ధి చేయనున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు.


Click it and Unblock the Notifications









