మానేసర్ లాకౌట్ ఎఫెక్ట్: అమ్మకాలు కోల్పోయిన మారుతి
దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియాకు ఇటీవల జరిగిన మానేసర్ అల్లర్లు కోలుకోలేని నష్టాలను మిగిల్చింది. మానేసర్ ప్లాంట్ దాదాపు నెల రోజుల పాటు లాకౌట్‌లో ఉండటంతో కంపెనీ గడచిన నెలలో భారీగా అమ్మకాలను నష్టపోయింది. ఆగస్టు 2012 నెలలో మారుతి సుజుకి కేవలం 54,154 యూనిట్లను (ఎగుమతులు 4,025 యూనిట్లతో కలిపి) మాత్రమే విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో మారుతి సుజుకి మొత్తం 91,442 యూనిట్లను విక్రయించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన జులై నెలలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్‌లో జరిగిన అల్లర్ల కారణంగా ఈ ప్లాంట్‌ను జులై 21, 2012 నుంచి ఆగస్ట్ 20, 2012 వరకూ లాకౌట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయిన కారణంగా, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎస్ఎక్స్4, ఏ-స్టార్ వంటి కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఆగస్ట్ 2012 నెలలో మారుతి సుజుకి మోడల్ వారీ అమ్మకాలు ఈ విధంగా ఉన్నాయి:
గడచిన నెలలో మొత్తం 22,062 యూనిట్ల మారుతి ఎమ్800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడుపోగా, 6,059 యూనిట్ల స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్ కార్లు అమ్ముడుపోయాయి. అలాగే, 3,085 యూనిట్ల డిజైర్ కార్లు, 447 యూనిట్ల ఎస్ఎక్స్4 కార్లు విక్రయం అయ్యాయి. కంపెనీ అందిస్తున్న ప్రీమియం సెడాన్ కిజాషి ఒక్క యూనిట్ అమ్ముపోలేదు. ఇక యుటిలిటీ వాహనాల విషయానికి వస్తే, 6,883 యూనిట్ల జిప్సి, గ్రాండ్ విటారా, ఎర్టిగా మోడళ్లు, 11,593 యూనిట్ల ఓమ్నీ, ఈకో వాహనాలు అమ్ముడుపోయాయి.
మొత్తమ్మీద గడచిన ఆగస్ట్ నెలలో కంపెనీ దేశీయ అమ్మకాలు 35 శాతం తగ్గి 77,086 యూనిట్ల నుంచి 50,129 యూనిట్లకు పడిపోయాయి. మొత్తం ఎగుమతులు 72 శాతం క్షీణించి 14,356 యూనిట్ల నుంచి 4,025 యూనిట్లకు పడిపోయాయి. ఓవరాల్‌గా చూసుకుంటే, ఆగస్ట్ 2011 నెలతో పోల్చుకుంటే ఆగస్ట్ 2012లో మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) 40.8 శాతం తగ్గి 91,442 యూనిట్ల నుంచి 54,154 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications








