దీపావళి కానుక: మారుతి 800 స్థానంలో కొత్త 800సీసీ కారు
ఒకప్పుట్లో ఓ చక్కటి ఫ్యామిలీ కారు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది మారుతి 800. చిన్న కారుగా మార్కెట్లో ప్రవేశించి పెద్ద అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ బుజ్జి కారుకు ప్రస్తుతం మార్కెట్లో ఆదరణ తగ్గిపోయింది. కఠినమైన కాలుష్య నిబంధనలు కొనుగోలుదారలు ఈ కారును దూరం చేశాయి. దీనికి తోడు ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో పెరిగిన పోటీ కూడా ఈ కారు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆధునిక కాలుష్య నిబంధనల దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ కారు అమ్మకాలపై నిషేధం విధించటం జరిగింది.
ఈ నేపథ్యంలో, తమ చిన్న కారు అంటే ఇష్టపడే వారిని నిరుత్సాపరచకూడదనే ఉద్దేశ్యంతో మారుతి సుజుకి ఇండియా ఈ మోడల్ స్థానంలో మరో సరికొత్త 800సీసీ కారును ప్రవేశపెట్టనుంది. మారుతి 800 స్థానాన్ని భర్తీ చేస్తూ, చిన్న కార్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఇంజన్, ఆకర్షనీయమైన డిజైన్, స్టయిల్, ఫీచర్లతో తీర్చిదిద్దిన ఓ కొత్త 800 కారును మారుతి సుజుకి అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ బుజ్జి కారును ఇండియన్ రోడ్లపై కంపెనీ టెస్టింగ్ చేస్తోంది.
పెట్రోల్ ధరలు భగ్గమంటున్న నేటి రోజుల్లో అధిక మైలేజీనిచ్చే విధంగా ఈ కొత్త 800సీసీ కారును మారుతి సుజుకి తీర్చిదిద్దింది. ఈ కొత్త కారు ఉత్పత్తిని జులైలో లేదా ఆగస్టులో గుర్గావ్‌లోని మారుతి ప్లాంటులో చేపట్టనున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. ఈ దీపావళి నాటికి మారుతి సుజుకి తమ కొత్త 800సీసీ కారులో కొనుగోలుదారులను సర్‌ప్రైజ్ చేయనుంది.
ఇప్పటికే మారుతి సుజుకి అందిస్తున్న రెండు 800సీసీ మోడల్స్ (మారుతి 800, ఆల్టో 800)తో పోలిస్తే, త్వరలో విడుదల కానున్న కొత్త 800సీసీ కారు అన్ని విధాలుగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. అందుకే దీని ధర కూడా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఆల్టో కారు ధర కన్నా కాస్తంత అధికంగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతి 800 ధర రూ.2.05 నుంచి రూ.2.3 లక్షల రేంజ్‌లోనూ, ఆల్టో 800 ధర రూ.2.4 నుంచి రూ.3.43 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications









