మానేసర్ అల్లర్లు: కొత్త మారుతి 800 కారు విడుదల వాయిదా
త్వరలో కొత్త మారుతి 800 కారును చూస్తామన్న కల, ప్రస్తుతానికి కలగానే మిగిలిపోయేలా ఉంది. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో తాజాగా నెలకొన్ని అనిశ్చితి కారణంగా, ఈ ఏడాది దీపావళి నాటికి మారుతి సుజుకి ఇండియా ప్రవేశపెట్టాలనుకున్న చిన్న కారు విడుదలను వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
గడచిన బుధవారం మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మికులు అల్లర్లకు పాల్పడి, ఫ్యాక్టరీలోని ఆస్తులకు నిప్పంటించడంతో పాటుగా, కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)ను కొట్టి, కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్లాంట్ లాకౌట్‌లో ఉంది. మానేసర్ ప్లాంటులో హింసాకాండ కారణంగా కొత్త ఆల్టో 800 కారు విడుదలను వాయిదా వేసినట్లు మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షింజో నకనిషి వెల్లడించారు.
ఏదేమైనప్పటికీ, మానేసర్ ప్లాంటులో నెలకొన్న ఈ తాజా అనిశ్చితి పరిస్థితులను నుంచి కంపెనీ త్వరగానే కోలుకున్నట్లయితే, తాము అనుకున్న సమయానికే ఈ కొత్త కారును ఆవిష్కరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కనుమరుగైపోతున్న మారుతి 800 స్థానాన్ని భర్తీ చేస్తూ, చిన్న కార్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఇంజన్, ఆకర్షనీయమైన డిజైన్, స్టయిల్, ఫీచర్లతో తీర్చిదిద్దిన ఓ కొత్త 800 కారును మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసినదే.
ప్రస్తుత మార్కెట్లో లభిస్తున్న ఆల్టో (800సీసీ ఇంజన్) కారు కన్నా అధిక పెర్ఫామెన్స్, మెరుగైన మైలేదీనిచ్చే విధంగా కంపెనీ ఈ కొత్త 800 కారును తీర్చిదిద్దింది. టెస్టింగ్ దశ పూర్తి చేసుకున్న ఈ చిన్న కారు వాస్తవానికి ఈ దీపావళి నాటికి దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల తావలసి ఉంది. ఈ కొత్త ఆల్టో 800 కారు ధర ప్రస్తుతం లభిస్తున్న మోడల్ కన్నా కాస్తంత అధికంగా ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









