స్మశానం, దేవాలయాలను పడగొట్టి ఫ్యాక్టరీ నిర్మించారు
ఈ మానేసర్ ప్లాంట్ మొత్తం 600 ఎకరాల్లో వ్యాపించి ఉంది. ఈ ప్లాంటు చుట్టూ సోమయాజి పలుమార్లు సందర్శించి జోతిష్య గణన చేశారు. ఈ ప్లాంటులో నిజంగానే వాస్తు సమస్యలు ఉన్నాయని, వెంటనే వాటిని సరిచేయకపోయినట్లయితే, అది పక్క యూనిట్లను కూడా ప్రభావితం చేసే ఆస్కారం ఉందని ఆయన ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, దీనిపై స్పందించేందుకు మాత్రం మారుతి సుజుకి అధికారులు నిరాకరించారు.
ఈ 600 ఎకరాల ప్రాంతంలో ఒకప్పుడు స్మశానం, మూడు దేవాలయాలు ఉండేవని సమాచారం. స్మశానం ఉన్న ప్రాంతంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ప్లాంట్ ఏర్పాటు కోసం దేవాలయాలను కూల్చేశారని వదంతులు కూడా ఉన్నాయి. ఈ వాస్తు దోషాలను సరిచేసి, దుష్టశక్తులను తరిమి కొట్టేందుకు గాను, ఈ ప్లాంటులో తక్షణమే శాంతి పూజలు నిర్వహించాలని, అప్పుడే ఈ గొడవలు సద్దుమణుగుతాయని జోతిష్యులు చెబుతున్నారు.
వాస్తవానికి, మానేసర్ ప్లాంట్‌లో మొత్తం మూడు యూనిట్లు (ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, ప్లాంట్ సి) ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకూ ఈ ప్లాంట్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోయాయి. అయితే, ఈ రెండేళ్ల కాలంలో ప్లాంట్ బి, ప్లాంట్ సి లలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. మానేసర్ ప్లాంటులో ఈ సమస్యలు కారణం ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ఇటు కార్మికులు అటు యాజమాన్యం భారీగానే నష్టపోతుంది.
ప్రస్తుతం మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ పూర్తిగా లాకౌట్‌లో ఉంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడయ్యే స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లు ఈ ప్లాంటులోనే ఉత్పత్తి అవుతాయి. దీంతో ఈ మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగిపోయింది. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ఈ సమస్యలు ఎప్పుడు సద్దుమణుగుతాయో కాలమే నిర్ణయించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications









