కొత్త డిజైర్ ఎఫెక్ట్..: మారుతి అమ్మకాల్లో మరో రికార్డ్
మారుతి సుజుకి ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో ఫిబ్రవరి నెలలో కంపెనీ విక్రయాలు జోరుగా సాగాయి. ఫిబ్రవరి 2012లో కంపెనీ అమ్మకాలు 6.54 శాతం వృద్ధి చెంది 1,18,949 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 1,11,645 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
దేశీయ అమ్మకాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కెల్లా అత్యధిక నెలవారీ అమ్మకాలను మారుతి సుజుకి ఫిబ్రవరి 2012లో నమోదు చేసుకుంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 1,07,653 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో దేశీయ అమ్మకాలు 1,01,543 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే కంపెనీ ఎగుమతులు కూడా 11.82 శాతం వృద్ధి చెంది 10,102 యూనిట్ల నుండి 11,296 యూనిట్లకు పెరిగాయి.
ఫిబ్రవరి 2012 నెలలో మారుతి సుజుకి డిజైర్ మోడల్ అమ్మకాలు ఏకంగా 58.78 శాతం వృద్ధిని సాధించి 15,068 యూనిట్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2011లో స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు కేవలం 9,490 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే మినీ-కార్ సెగ్మెంట్లో ఎమ్800, ఏ-స్టార్, ఆల్టో, వ్యాగన్ఆర్ అమ్మకాలు మాత్రం 8.24 క్షీణించి 53,515 యూనిట్ల నుండి 49,104 యూనిట్లకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications









