మారుతి సుజుకిలో కొత్తగా 1900 మందికి ఉద్యోగ అవకాశాలు
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ప్రస్తుతం సంవత్సరంలో కొత్తగా 1,900 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. వీరిలో 900 మందిని ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విభాగాల్లోనూ, మిగిలిన 1000 మందికి షాప్ ఫ్లోర్ టెక్నిషియన్లుగా నియమించుకోనున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్‌వై సిద్ధిక్వి తెలిపారు.
కాగా.. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 200 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, ఈ ఏడాది నాటికి మొత్తం 1,900 మందిని నియమించుకుంటామని ఆయన వివరించారు. అలాగే, రూ.25 కోట్ల పెట్టుబడితో వెబ్ బేస్డ్ ట్రెయినింగ్ అకాడమీని కూడా ప్రారంభించనున్నామని, ఈ అకాడమీని నేరుగా డీలర్లు సప్లయిర్లతోపాటు సుజుకి గ్రూపుకు చెందిన వారితో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ అకాడమీ ఉద్యోగి తాను ఉన్న స్థలం నుంచే 75 శాతం శిక్షణను పొందే అవకాశం ఉంటుంది. శిక్షణలో సిబ్బంది నైపుణ్యాలతో పాటుగా, వినియోగదారులతో ఎలా వ్యవహరించాలనే వాటిపై కూడా శిక్షణ ఉంటుందని సిద్ధిక్వి చెప్పారు. ఇకపోతే... మారుతి సుజుకి ఇండియా తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీకు ఇండియాలో ఇది మూడవ ప్లాంట్ అని, ఈ ప్లాంటు ద్వారా కొత్తగా 1,600 మంది ఉద్యోగులు ఉపాధి పొందనున్నారని తెలిపారు. గుజరాత్ ప్లాంట్ కోసం మారుతి సుజుకి ఇండియా రూ.4,000 కోట్లు పెట్టుబడులను వెచ్చిస్తోంది. ఇప్పటి వరకూ మారుతి సుజుకి కంపెనీలో మొత్తం 9,350 మంది ఉద్యోగులు (వివిధ విభాగాల్లో కలిపి) ఉన్నారు.


Click it and Unblock the Notifications








