భారీగా పెరిగిపోయిన మారుతి స్విఫ్ట్, డిజైర్ వెయిటింగ్ పీరియడ్
మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ లాకౌట్ దెబ్బతో, కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ల వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. గడచిన జులై నెలలో మానేసర్ ప్లాంట్‌లో కార్మికులు అల్లర్లకు పాల్పడి, ఫ్యాక్టరీ భారీ ఆస్తి నష్టాన్ని కలిగించడమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) ప్రాణాలు కోల్పోవటానికి కూడా కారణమయ్యారు.
ఈ నేపథ్యంలో, జులై 20 నుంచి ఆగస్టు 20 వరకూ కంపెనీ తమ మానేసర్ ప్లాంట్‌ను మూసివేసిన సంగతి తెలిసినదే. దీంతో ఈ ప్లాంటులో తయారవుతున్న స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి, మార్కెట్లో అందుబాటులో స్టాక్ కాస్తా ఖాలీ అయిపోయింది. అయినప్పటికీ డీలర్లు ఈ మోడళ్లకు బుకింగ్‌లను అంగీకరించడాన్ని మాత్రం నిలిపివేయలేదు. ఫలితంగా, వీటి బుకింగ్ లిస్ట్ పెరిగి, వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగిపోయింది.
ప్రస్తుతం స్విఫ్ట్ కోసం సుమారు 1,65,000 యూనిట్లకు పైగా పెండిగ్ ఆర్డర్లు ఉండగా, స్విఫ్ట్ డిజైర్ కోసం 65,000 యూనిట్లకు పైగా పెండిగ్ ఆర్డర్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ వెయిటింగ్ పీరియడ్ 3 నెలల నుంచి 4 నెలల మధ్యలోనూ, డీజిల్ వెర్షన్ వెయటింగ్ పీరియడ్ 8 నెలలకు పైబడి ఉంది. అలాగే, స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కోసం 3 నెలల నుంచి 6 నెలల వరకూ వెయటింగ్ పీరియడ్ ఉంటోంది.
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో దశల వారీగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తుంది. అలాగే, పెండింగ్ స్విఫ్ట్ డిజైర్ బుకింగ్‌లను క్లియర్ చేసేందుకు గాను గుర్గావ్ ప్లాంటులో కంపెనీ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. మార్కెట్లో ఈ రెండు మోడళ్లకు ప్రత్యామ్నాయ మోడళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు మాత్రం మారుతి బ్రాండ్ కార్ల కోసం నెలలతరబడి అయినా వేచి ఉండేందుకు సిద్ధంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications









