పెట్రోల్ ధరలు, ఎక్సైజ్ డ్యూటీ, వడ్డీ రేట్లతో ఆటో సెక్టార్ మటాష్
2012లో యుగాంతం రావడం మాటేమో కానీ.. పెరుగుతున్న ధరలతో ప్రజలకు తమ కోరికలను అంతం చేసుకోవాల్సి వస్తోంది. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కేంద్ర బడ్జెట్‌లో పెరిగిన ఎక్సైజ్ సుంకాలు తద్వారా పెరిగిన కార్ల ధరలు, అధిక వడ్డీ రేట్ల కారణంగా కార్ల జోలికి వెళ్లే కొనుగోలుదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఫలితంగా గడచిన మే 2012 నెలలో దేశీయ కార్ల అమ్మకాలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయి.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, గడచిన మే నెలలో మొత్తం ప్యాసింజర్ అమ్మకాలు కేవలం 2.78 శాతం మాత్రమే వృద్ధిని సాధించి 1,63,229 యూనిట్లుగా నమోదు కాగా.. ఇదివరకటి సంవత్సరం మే నెలలో అమ్మకాలు 1,58,809 యూనిట్లుగా ఉన్నాయి. గడచిన సంవత్సరం అక్టోబర్ నుంచి గమనిస్తే, ఇది అతి తక్కువ వృద్ధి. ఆ నెలలో అమ్మకాలు 23.77 శాతం తగ్గాయని ఎస్ఐఏఎమ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు.
అమ్మకాలు తగ్గుముఖం పట్టటానికి ప్రధాన కారణం, పెట్రోల్ ధరలు, ఎక్సైజ్ సుంకాలు, వడ్డీ రేట్లేనని అయితే ఈ ధరలు, సుంకాల ప్రభావం విలాసవంతమైన కార్లపై పడలేదని మాథుర్ చెప్పారు. ఒక వేళ ప్రభుత్వం డీజిల్ కార్లపై ప్రత్యేక పన్నులు విధించాలని నిర్ణయిస్తే, దేశీయ ఆటోమొబైల్ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేశీయ కార్ మార్కెట్లో 45 శాతం వాటా కలిగిన, దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా గడిచిన మే నెల అమ్మకాల్లో 5.94 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇక రెండవ స్థానంలో కొరియన్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కేవలం 31,939 కార్లను మాత్రమే విక్రయించి 3.03 శాతం వృద్ధికనబరిచింది. ఇకపోతే టాటా మోటార్స్ 17,371 యూనిట్లను విక్రయించి 6.70 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది.
ఇక మొత్తం టూవీలర్స్ అమ్మకాల విషయానికి వస్తే.. మే నెలలో ఇవి 11.40 శాతం పెరిగి 11,92,688 యూనిట్లుగా నమోదు కాగా.. గతేడాది ఇదే సమయంలో ఇవి 10,70,603 యూనిట్లుగా ఉన్నాయి. బజాజ్ ఆటో బైక్ సేల్స్ 5.30 శాతం తగ్గి 2,06,751 యూనిట్లుగా ఉండగా, హోండా అమ్మకాలు 45.45 శాతం పెరిగి 88,334 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, టీవీఎస్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 14.17 శాతం తగ్గి 47,175 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి.
ఊపందుకున్న ఎగుమతులు:
దేశీయ మార్కెట్లో అమ్మకాలు మందగించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు మాత్రం జోరుగానే సాగాయి. మే 2012లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 34.16 శాతం పెరిగి 45,036 యూనిట్లుగా ఉండగా, అంతకు ముందు ఏడాది ఇవి 33,570 యూనిట్లుగా ఉన్నాయి. యి. ఐరోపాయేతర దేశాల నుంచి లభిస్తున్న పటిష్టమైన డిమాండ్ కారణంగా ఈ వృద్ధిని సాధించిగలిగామని ఎస్ఐఏఎమ్ తెలిపింది.


Click it and Unblock the Notifications








