మే 15న మార్కెట్లోకి రానున్న మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350 సిడిఐ
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ నుండి ఓ మంచి పవర్‌ఫుల్ లగ్జరీ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారి కల త్వరలోనే నిజం కాబోతుంది. ఎందకుటే జర్మనీకు చెందిన ఈ ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఈ నెల 15వ తేదీన ఓ సరికొత్త ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్‌కు తీసుకురానుంది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఎమ్ఎల్ క్లాస్‌లో ఓ సరికొత్త మోడల్‌ను మే 15వ తేదీన కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
ఈ సెగ్మెంట్లోని లగ్జరీ ఎస్‌యూవీలను సవాల్ చేస్తూ మెర్సిడెస్ బెంజ్ ఇండియా లిమిటెడ్ (ఎమ్‌బిఐఎల్) అందిస్తున్న ఎమ్ఎల్ క్లాస్‌లో "ఎమ్ఎల్ 350 సిడిఐ" అనే కొత్త వేరియంట్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఇండియాలో దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉండొచ్చని అంచనా. మెర్సిడెస్ బెంజ్ ఇండియా తొలుత ఈ మోడల్‌ను సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఇండియాకు దిగుమతి చేసుకోనుంది. అనంతరం, ఇండియాలోనే వీటిలోని అసెంబ్లింగ్ (సికెడి) చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఎమ్ఎల్ 350 సిడిఐ వేరియంట్ విడుదల తర్వాత మెర్సిడెంస్ బెంజ్ నుండి ఎమ్ఎల్ 250, ఎమ్ఎల్ 63 ఏఎమ్‌జి మోడళ్లు కూడా ఇండియాకు రానున్నాయి. ఎమ్ఎల్ 350 సిడిఐ వేరియంట్‌లో ఇంజన్ పవర్‌ను 258 బిహెచ్‌పిలకు పెంచటం జరిగింది. ఇది ప్రస్తుతం లభిస్తున్న వేరియంట్ కన్నా 34 బిహెచ్‌పిలు అధికం. ఇందులో 7-స్పీడ్ జిట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చారు.
మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350 సిడిఐ కేవలం 7.4 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 224 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో తీర్చిదిద్దిన ఈ ఎమ్ఎల్ 350 సిడి వేరియంట్ ఈ సెగ్మెంట్లో ఇతర లగ్జరీ కార్ కంపెనీల నుండి లభిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, పోర్షే కెయిన్నీ, ఆడి క్యూ7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications









