7-సీటర్ అవుట్‌లాండర్ ధరను పెంచిన మిత్సుబిషి

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 5-సీటర్ వెర్షన్ ధర కన్నా సుమారు లక్ష రూపాయల తక్కువ ధరకే ఈ 7-సీటర్ వెర్షన్‌ను గడచిన మార్చి 16న మిత్సుబిషి మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఈ 7-సీటర్ వెర్షన్ 2012 అవుట్‌లాండర్ క్రాసోవర్ ధరను రూ.60,000 మేర కంపెనీ పెంచడం జరిగింది. తాజా పెంపుతో 2012 అవుట్‌లాండర్ క్రాసోవర్ ధర రూ.20.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు పెరిగింది.
ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న 5-సీటర్ వెర్షన్ అవుట్‌లాండర్‌లోనే వెనుక వైపు సన్నటి పొడవైన సీటును (థర్డ్ రో సీట్) అమర్చి అదనంగా మరో ఇద్దరు ప్రయాణికులకు చోటు కల్పించేలా ఈ కొత్త మోడల్‌ను కంపెనీ డిజైన్ చేసింది. ఏదేమైనప్పటికీ మూడవ వరుస సీట్లో కూర్చేనే వారికి లెగ్‌రూమ్ కాస్తంత ఇరుకుగా అనిపిస్తుంది. ఈ వెనుక సీటును అవసరం లేనప్పుడు మడచుకొని, లగేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇంతకు మించి ఈ కొత్త వేరియంట్‌లో ప్రత్యేకమైన మార్పులు ఏవీ లేవు. అన్ని అవుట్‌లాండర్ వేరియంట్లు కూడా 4-సిలిండర్, 2.4 లీటర్, పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. ఇది 167 బిహెచ్‌పిల శక్తిని, 226 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో లభించే ఈ ఎస్‌యూవీ కేవలం 10 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 190 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications








