యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో BMW 3 సిరీస్‌కు 5-స్టార్ రేటింగ్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త అప్‌గ్రేడెడ్ 3 సిరీస్ సెడాన్ ఎంత సురక్షితమైనదో ఈ ఫోటో చూస్తేనే తెలిసిపోతుంది. యూరో ఎన్‌సిఏపి సిరీస్ క్రాష్ టెస్ట్‌లో 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లగ్జరీ సెడాన్ 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. సాధారణంగా ఈ క్రాష్ టెస్ట్‌లో ఏ కారైనా కూడా 5-స్టార్ రేటింగ్‌ను తెచ్చుకుందంటే అది అన్ని విధాల సురక్షితమైన కారని, అందులో ప్రయాణికులకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని అర్థం.
6వ తరానికి ఈ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ క్రాష్ టెస్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలను కనబరిచింది. యూరప్‌కు చెందిన యూరో ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ఈ క్రాష్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ క్రాష్ టెస్ట్‌లో ఓ సరికొత్త బ్రాండ్ న్యూ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సెడాన్‌ను ఉపయోగిస్తారు. ఈ కారును ఆటోమేటిక్‌గా నడిచేలా ఒక నిర్ధిష్ట వేగం వద్ద యాక్సిడెంట్ జరిగేలా చేసి తర్వాతి పరిణామాలను అంచనా వేస్తారు.
అందులో ప్రయాణికుల (ప్రయాణికుల స్థానంలో బొమ్మలను ఉపయోగిస్తారు, బొమ్మలకు తగిలే దెబ్బలను బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తారు)కు ఎంత మేర రక్షణ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్‌లు సరైన సమయంలో విచ్చుకున్నాయా లేదా, సేఫ్టీ సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్టిఫై చేయటం జరుగుతుంది.
ఇకపోతే, 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో (1 పెట్రోల్, 4 డీజిల్) లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ 3 సిరీస్ (320డి)లో ఉపయోగించిన 4-సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీటర్ డీజిల్‌కు 18.88 కి.మీ. మైలేజీనిస్తుంది.
అలాగే, పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ (328ఐ)లో ఉపయోగించిన ట్విన్ పవర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రోల్‌కు 14.79 కి.మీ. మైలేజీనిస్తుంది.
దేశీయ విపణిలో లభ్యమవుతున్న 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి - రూ. 28.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి స్పోర్ట్ లైన్ - రూ. 31.50 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి లగ్జరీ లైన్- రూ. 31.50 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (డీజిల్) 320డి లగ్జరీ ప్లస్ - రూ. 36.90 లక్షలు
* బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్: (పెట్రోల్) 328ఐ స్పోర్ట్ లైన్ - రూ. 37.90 లక్షలు


Click it and Unblock the Notifications









