అక్టోబర్ 15న మార్కెట్లోకి రానున్న కొత్త చెవర్లే స్పార్క్
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా నుంచి దేశీయ విపణిలో లభిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ చెవర్లే స్పార్క్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మాకు అందిన తాజా సమాచారం ప్రకారం, కొత్త ఫేస్‌లిఫ్టెడ్ చెవర్లే స్పార్క్ ఈనెల 15న మార్కెట్లో విడుదల కానుంది. ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారులు అభిరుచులు, మార్కెట్ ట్రెండ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన కొత్త స్పార్క్ చిన్న కార్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సెగ్మెంట్లోకి కొత్తగా రానున్న మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, టాటా నానో (టాప్-ఎండ్ వేరియంట్) వంటి చిన్న కార్లకు కొత్త స్పార్క్ పోటీగా నిలువనుంది. కొత్త చెవర్లే స్పార్క్‌లో రీడిజైన్ చేయబడిన కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్, హనీకోంబ్ గ్రిల్, మరింత ఆకర్షనీయమైన చెవెర్లే లోగో వంటి మార్పులను గమనించవచ్చు. అంతేకాకుండా, ఈ కొత్త వెర్షన్‌కు అమర్చిన రియర్ వ్యూ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్‌ను కూడా మనం పరిశీలించవచ్చు. బెంగుళూరులో ఉన్న చెవర్లే సాంకేతి విభాగం ఈ డిజైన్ మార్పులను చేపట్టింది.
ఐదేళ్ల క్రితం చెవర్లే స్పార్క్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం ఇది కేవలం పెట్రోల్, ఎల్‌పిజి వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. అయితే, ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరగుతుండటంతో, మరింత మెరుగైన మైలేజీనిచ్చే స్పార్క్‌ను కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశ్యంతో జనరల్ మోటార్స్ ఈ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. మైలేజ్ పరంగా ఇది పాత స్కార్క్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది. సరికొత్త లుక్ అండ్ ఫీల్‌నిచ్చే డిజైన్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్, రీట్యూన్ చేయబడిన ఇంజన్ వంటి ప్రధాన మార్పులతో కొత్త చెవర్లే స్పార్క్ మార్కెట్లోకి రానుంది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్పార్క్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. కొత్త స్పార్క్‌లో కూడా ఇదే ఇంజన్‌ను రీట్యూన్ చేసి ఉపయోగిస్తారా లేదా ఎక్కువ మైలేజ్ కోసం తక్కువ సీసీ కలిగిన (800సీసీ) ఇంజన్‌ను ఉపయోగిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. చెవర్లే స్పార్క్‌లో అప్‌డేటెడ్ వెర్షన్ ఇప్పటికే అమెరికన్ మార్కెట్లో చెవర్లే బీట్ పేరుతో అమ్ముడవుతోంది. గడచిన జవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ ప్రదర్శించిన ఎలక్ట్రిక్ చెవర్లే స్పార్క్ కాన్సెప్ట్ (ఈ-స్పార్క్) డిజైన్‌ను నుంచి స్ఫూర్తి పొంది కొత్త స్పార్క్‌ను డిజైన్ చేశారు.
చెవర్లే స్పార్క్ చిన్న కారు అయినప్పటికీ, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, మంచి డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్‌ను కలిగి ఉండి, చిన్న కారు ప్రియులకు చక్కగా సరిపోతుంది. చెవర్లే స్పార్క్‌లో సిఎన్‌జి వేరియంట్ కూడా మార్కెట్లోకి రావచ్చని సమాచారం. భారత మార్కెట్లో ప్రస్తుత వెర్షన్ చెవర్లే స్పార్క్ ధర రూ.3.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త చెవర్లే స్పార్క్ కూడా ఇంచు మించు ఇదే ధరను కలిగి ఉండొచ్చని అంచనా. మరి మీరు కూడా కొత్త స్పార్క్ కోసం ఎదురు చూస్తున్నారా..?


Click it and Unblock the Notifications









