మరో నాలుగేళ్లలో 10 ఉత్పత్తులు: నిస్సాన్ ఇండియా
భారత మార్కెట్లో ఇప్పటికే రూ.4,500 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని, రానున్న కాలంలో సాలీనా 4 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ అధికారులు తెలిపారు. 2016 ఆర్థిక సంవత్సరం నాటికి 10 కొత్త మోడళ్లను ఇండియాలో విడుదల చేస్తామని, అలాగే ప్రస్తుతం 75గా ఉన్న తమ డీలర్ నెట్‌వర్క్‌ను 2013 సంవత్సరం నాటికి 300కు విస్తరిస్తామని నిస్సాన్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ తెలిపారు.
నిస్సాన్ ఇండియా తాజాగా దేశీయ విపణిలో విడుదల చేసిన బహుళ ప్రయోజన వాహనం 'నిస్సాన్ ఇవాలియా'ను బెంగుళూరు మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతానికి ఇవాలియాను ఇండియన్ మార్కెట్ నుంచి ఎగుమతి చేసే ఆలోచన లేదని, నెలకు సుమారు 2,000 నుంచి 2,500 యూనిట్ల ఇవాలియాలను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని టిప్నిస్ తెలిపారు.
నిస్సాన్ ఇండియాకు ఇవాలియా భారత మార్కెట్లో తయారవుతున్న 3వ ఉత్పత్తి. దీని ఉత్పత్తిలో సుమారు 85 శాతం విడిభాగాలను ఇండియా నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ లోకలైజేషన్‌ను 100 శాతానికి తీసుకురావాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. పెద్ద కుటుంబాలను, దూర ప్రయాణాలు ఎక్కువగా చేసే వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన నిస్సాన్ ఇవాలియాను ఆయన కర్ణాటక మార్కెట్లో విడుదల చేశారు. బెంగుళూరులో నిస్సాన్ ఇవాలియా ధరలు ఇలా ఉన్నాయి:
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్ఈ - రూ.8.64 లక్షలు
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్ఈ ప్లస్ - రూ.9.07 లక్షలు
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్ఎల్ - రూ.9.65 లక్షలు
* నిస్సాన్ ఇవాలియా ఎక్స్‌వి - రూ.10.16 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)


Click it and Unblock the Notifications









