నవంబర్ 1 నుంచి ప్రియం కానున్న నిస్సాన్ మైక్రా, సన్నీ
మీరు నిస్సాన్ మైక్రా, సన్నీ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే, ఇదే మీకు అనువైన సమయం. ఇప్పుడు కాకుండా వచ్చే నెలలో ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఎందుకంటే, నవంబర్ 1 నుంచి మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్‌ల ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఉత్పాధక వ్యయం, రవాణా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల 1వ తేది నుంచి వీటి ధరలను పెంచనున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, వీటిపై ఎంత మొత్తంలో ధర పెంచనున్నామనే విషయాన్ని మాత్రం నిస్సాన్ వెల్లడించలేదు. కాగా.. కంపెనీ ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టి బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) నిస్సాన్ ఇవాలియా ధరను మాత్రం పెంచబోవట్లేదని స్పష్టం చేసింది. పెరిగిన ఇన్‌పుట్ ధరలు, రవాణా ఖర్చులను పాక్షికంగా తగ్గించుకునేందుకు వీటి ధరలు పెంచక తప్పడం లేదని నిస్సాన్ మార్కెటింగ్ భాగస్వామి అయిన హోవర్ ఆటోమోటివ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితీష్ తిపిన్స్ తెలిపారు.
ప్రస్తుతం దేశీయ విపణిలో నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.22 లక్షల నుంచి రూ.6.42 లక్షల రేంజ్‌లోను, నిస్సాన్ సన్నీ సెడాన్ ధరలు రూ.5.93 లక్షల నుంచి రూ.8.93 లక్షల రేంజ్‌లోను ఉన్నాయి (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ విపణిలో నిస్సాన్ మోటార్ ఇండియా అన్ని సెగ్మెంట్లలో ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది. మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్, ఇవాలియా ఎమ్‌పివిలతో పాటుగా ప్రీమయం సెడాన్ టియానా, ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్-ట్రైల్, స్పోర్ట్స్ కార్ 370జెడ్ లను నిస్సాన్ ఇక్కడి మార్కెట్లో అందిస్తోంది. ఇందులో మైక్రా, సన్నీ, ఇవాలియాలను దేశీయంగానే ఉత్పత్తి చేస్తుండగా, టియానా, ఎక్స్‌ట్రైల్, 370జెడ్‌లను మాత్రం దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది.


Click it and Unblock the Notifications









