పెట్రోల్ ధరల ఎఫెక్ట్: పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తగ్గించిన మారుతి
ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలను చూసి భయపడుతున్న కస్టమర్లు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయటంలో వెనుకంజ వేస్తున్నారు. దీంతో ప్రధానంగా పెట్రోల్ కార్లపైనే ఆధారపడి ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి అగ్రగామి కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తగ్గించింది.
ఇప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం, పెట్రోల్ కార్ల అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్న తరుణంలో, వీటి ఉత్పత్తిని కూడా తగ్గిస్తున్నామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు. కంపెనీ నుండి అత్యధికంగా పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టోతో పాటుగా కొన్ని ఇతర పెట్రోల్ కార్ల ఉత్పత్తని కుదిస్తున్నామని ఆయన వివరించారు.
మారుతి సుజుకి ఇటీవలే ఆల్టో, ఎమ్800, ఏ-స్టార్, ఎస్టిలో, ఓమ్నీ వంటి పెట్రోల కార్ల ఉత్పత్తిని మూడు రోజుల పాటు నిలిపివేసింది. సాధారణంగా తాము పెట్రోల్ కార్ల విషయంలో మూడు వారాల ఇన్వెంటరీలను నిర్వహిస్తామని, అమ్మకాలు తగ్గుతుండటంతో ఈ ఇన్వెంటరీలు నాలుగున్నర వారాలకు పెరిగాయని, అందుకే గడచిన మూడు రోజులుగా వీటి (పెట్రోల్ కార్ల) తయారీని నిలిపేశామని పారీక్ తెలిపారు.
ఈ మూడు రోజులు ఉత్పత్తిని నిలిపి వేయటం మూలానా సుమారు 8,000-8,500 వరకూ పెట్రోల్ కార్ల ఉత్పత్తి తగ్గింది. వరుసగా గడచిన నాలుగు నెలలు వృద్ధి కనబరచిన కంపెనీ అమ్మకాలు మే నెలలో 4.99 శాతం మేర తగ్గదల నమోదు చేసుకొని 98,884 యూనిట్లను విక్రయం అయ్యాయి. గత కొద్ది కాలంగా పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గతూ రావటమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఏదేమైనప్పటికీ.. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను చూస్తుంటే, సొంత కారు కలను నిజం చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి ప్రజల కారు కల కలగానే మిగిలిపోతుంది.


Click it and Unblock the Notifications








