భారత్ బంద్ ఎఫెక్ట్: పెట్రోల్ ధరల తగ్గింపుపై నేడు నిర్ణయం
గతంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధరపై రూ.7.50 పెంచడంతో సామాన్యుడి గుండె భగ్గుమంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. నిన్న (గురువారం) జరిగిన భారత్ బంద్ ప్రభావంతో చమురు కంపెనీలు ఓ మెట్టు దిగి వచ్చేలా కనిపిస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరల నుండి కొనగొలుదారులకు కాస్తంత ఉపశమనం కలిగిస్తూ, దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధరను రూ.1.50 నుండి రూ.1.60 తగ్గించేందుకు చమురు కంపెనీలు మొగ్గ చూపుతున్నాయి.
పెంచిన ధరతో పోలిస్తో, ఈ తగ్గింపు నామమాత్రమే అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ తగ్గింపు అంశానికి సంబంధించి చమురు కంపెనీలు మరికాసేపట్లో ఓ నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున (ప్రతి నెల 1వ తేది మరియు 15వ తేది) పెట్రోల్ ధరలపై సమీక్ష జరిపి పెంచడం లేదా తగ్గించడంపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు 124 డాలర్ల నుంచి 114-115 డాలర్లకు తగ్గుతున్న నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో చమురు కంపెనీలు పెట్రోల్ ధరను ప్రతి లీటరుపై రూ.1.50-1.60 మేర తగ్గించే ఆస్కారం ఉంది. మరోవైపు పెట్రోల్ ధరల పెంపుపై ఇటు ప్రతిపక్ష పార్టీలు, అటు సామాన్య ప్రజలు గొంతెత్తడంతో కూడా చమురు కంపెనీలు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెల 23వ తేదీన పెట్రోల్ ధరను ప్రతి లీటరుపై రూ.7.50 మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








