టాటా నానోపై భారీ ఆశలు పెట్టుకున్న రతన్ టాటా
ప్రపంచంలోనే అత్యంత చౌక కారుగా గ్లోబల్ కార్ కంపెనీల్లో గుబులు పుట్టించిన టాటా మోటార్స్ ప్రజల కారు ‘టాటా నానో' కథ ముగిసిపోలేదని కంపెనీ చైర్మన్ రతన్ టాటా చెప్పారు. టాటా నానో ప్రారంభంలో అవకాశాలను జారవిడుచుకున్న మాట వాస్తవమేనని, అయినప్పటికీ నానో పట్ల తమ నమ్మకం చెక్కుచెదరలేదని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈకారుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అందుబాటు ధరలో ఉండే ఇలాంటి కారుకు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెద్ద మార్కెట్ ఉండగలదని 2011-12 టాటా మోటార్స్ వార్షిక నివేదికలో రతన్ టాటా తెలిపారు. నానో ఆర్థిక మూలాలు, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్, సర్వీస్ నెట్‌వర్క్‌లు దేశీయ విపణిలో దీని స్థానాన్ని సుస్థిరం చేయగలవని ఆయన పేర్కొన్నారు. 2008లో నానోను ప్రారంభించినప్పుడు విశ్వవ్యాప్తంగా ఆదరణ లభించిందని, అయితే పశ్చిమ బెంగాల్‌లో అవరోధాల కారణంగా తొలుత అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆయన అన్నారు.
గత 2011-12లో టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు అంచనాల కన్నా తగ్గినప్పటికీ, టాటా నానో అమ్మకాలు మాత్రం ఇదివరకటి సంవత్సరంగా కన్నా పెరిగాయని రతన్ టాటా తెలిపారు. నానో బ్రాండ్ నేమ్‌ను దెబ్బతీసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, ఇది పేదల కారు అని తాము ఏనాడూ అనలేదని చౌక ధర కలిగిన కారు అని మాత్రమే చెప్పామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications









