దీపావళికి సందడి చేయనున్న రెనో కొత్త సెడాన్
అత్యంత పోటీతత్వ ధరకే సరికొత్త ఎస్‌యూవీ డస్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన రెనో ఇండియా (Renault India) ఈ దీపావళికి మరొక సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రెనో ఇండియా హ్యాచ్‌బ్యాక్ (పల్స్), ప్రీమియం సెడాన్ (ఫ్లూయెన్స్), ప్రీమియం ఎస్‌యూవీ (కొలియోస్), ఎస్‌యూవీ (డస్టర్) సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందిస్తున్న సంగతి తెలిసిందే.
అత్యధికంగా అమ్మకాలు సాగుతున్న ఎంట్రీ లెవల్ / సి-సెగ్మెంట్ సెడాన్ మార్కెట్లో రెనో ఇండియాకు ఎలాంటి ఉత్పత్తులు లేవు. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో ఓ సరికొత్త కారును రెనో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అయితే, ఇది తమ జపాన్ భాగస్వామి నిస్సాన్ అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ సెడాన్ సన్నీ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని (మైక్రా, పల్స్ మాదిరిగా) డిజైన్ చేయనున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, నిస్సాన్ సన్నీ రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌ను రెనో ఇండియా ఈ దీపావళికి విడుదల చేయనుంది. ఈ రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్ సన్నీను 'రెనో స్కాలా' అని పిలువనున్నారు. నిస్సాన్ సన్నీ ఎక్స్టీరియర్ డిజైన్‌కు రెనో స్కాలా ఎక్స్టీరియర్ డిజైన్‌కు భారీ వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది. అయితే, ఇంటీరియర్స్ విషయంలో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. ఇక రెనో స్కాలా ఉత్పత్తి ఖర్చును తగ్గించేందుకు గానూ నిస్సాన్ సన్నీలో ఉపయోగించే ఇంజన్‌నే ఇందులో ఉపయోగించనున్నారు.
రెనో స్కాలా తొలుతగా డీజిల్ వేరియంట్‌లో విడుదలై, అనంతరం పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. రీనాల్ట్-నిస్సాన్ అలయన్స్‌ను దృష్టిలో ఉంచుకొని రెనో స్కాలా ధరను నిస్సాన్ సన్నీ కాస్తంత అధికంగా ఉంచేలా రెనో ఇండియా జాగ్రత్తపడొచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రెనో తమ కొత్త ఎస్‌యూవీ డస్టర్‌ను కేవలం రూ.7.19 లక్షల ప్రారంభ ధరకే అందిస్తున్న సంగతి తెలిసిందే. రెనో డస్టర్‌ను యూకేతో సహా మరిన్ని దేశాలకు తమ చెన్నై ప్లాంటు నుంచి ఎగుమతి చేస్తామని రెనో ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) లెన్ కరాన్ తెలిపారు. ఈ ఏడాది 30-35 వేల కార్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ధేశించామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications









