అప్‌గ్రేడెడ్ డీజిల్ వేరియంట్ ఫ్లూయెన్స్‌ను విడుదల చేసిన రెనో
మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్, రీనాల్ట్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆధునిక డీజిల్ ఇంజన్‌ను ఈ సరికొత్త ఫ్లూయెన్స్ ఈ4 వేరియంట్లో ఉపయోగించారు. ఇందులో అమర్చిన 1.5 లీటర్ కామన్ రైల్ టర్బో డీజిల్ కె9కె ఇంజన్ 108 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమయ్యే ఈ కారు 20.4 కె.ఎమ్.పి.ఎల్. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
రెనో నుండి ఇండియాలో విడుదలైన మొదటి ఉత్పత్తి ఫ్లూయెన్స్ సెడాన్ అని, భారత మార్కెట్ పట్ల తమ కట్టుబాటుకు, కస్టమర్ల నుండి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ల ఫలితమే ఈ అప్‌గ్రేడెడ్ వేరియంట్ అని రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ నాసిఫ్ తెలిపారు. రెనో విడుదల చేసిన ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఫ్లూయెన్స్ ఈ4 డీజిల్ వేరియంట్ ధర రూ.15.2 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, టొయోటా కరోలా, స్కొడా లారా వంటి మోడళ్లకు 2012 వెర్షన్ ఫ్లూయెన్స్ పోటీగా నిలువనుంది. గడచిన మే నెలలో ఫ్లూయెన్స్ సెడాన్ (పెట్రోల్ వేరియంట్)ను రెనో తొలిసారిగా ఇండియాలో విడుదల చేసింది. లెథర్ ఇంటీరియర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, రియర్ సన్‌బ్లైండ్స్, ఎలక్ట్రోక్రోమ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీ, ఫ్రంట్ సీట్లలో అమర్చిన సైడ్ చెస్ట్ లెవల్ ఎయిర్ బ్యాగ్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో ఇది లభిస్తుంది.


Click it and Unblock the Notifications









