ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రూ.13,000 కోట్లు!
దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు మరియు వాటి తయారీదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ పెట్టుబడులను అందించనుంది. వీటి అభివృద్ధి కోసం రానున్న ఎనిమిదేళ్లలో రూ.13,000 కోట్ల నిధులను ఇందుకు కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ మూడు నెలల్లోగా క్యాబినెట్ అనుమతిని కోరనున్నట్లు సమాచారం.
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం పెరిగి, వాటి లభ్యత నానాటికీ తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రత్యేక గుర్తింపు లభించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నుంచే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పట్ల కొనుగోలుదారుల్లో అవగాహనను పెంచేందుకు, వీటి తయారీదారులకు ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

2020 నాటికి ఈ తరహా వాహనాల అమ్మకాలను పెరిగేలా చూడటం, ఈ రంగం వైపుకు పారిశ్రామిక వర్గాల దృష్టి మరల్చడం వంటివి చేయాలనుకుంటున్నట్లు భారీ పరిశ్రమల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెంచేందుకు గానూ, వీటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు తప్పనిసరిగా రుణ సదుపాయం అందించేందుకు ఎన్‌ఎమ్‌హెచ్‌ఇవిలో భాగంగా ఓ చట్టబద్ధమైన నిబంధనను సైతం ఆచరణలోకి తీసుకురావాలని భారీ పరిశ్రమలశాఖ నిర్ణయించినట్లు సదరు అధికారి స్పష్టంచేశారు.
కాగా.. ఇప్పటికే మన మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్, ఎవాన్ సైకిల్స్, బిఎస్‌ఎ మోటార్స్, లోహియో ఆటో, మహీంద్రా రేవా వంటి పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఉత్పత్తులను అందిస్తున్నప్పటికీ, వీటికి రుణ సదుపాయాన్ని అందించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్న కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే కార్ల తయారీతో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి, వీటి తయారీదారులకు తగిన ప్రోత్సాహకాలను, ఇతర రాయితీలను అందించేందుకు ప్రభుత్వం నుంచి తగిన హామీ వచ్చేలా కృషి జరుగుతోందని ఆయన వెల్లడించారు.
వాస్తవానికి సాంప్రదాయ ఇంధనాలతో నడిచే పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సహకరించడమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎటువంటి హానిని కలిగించవు. అంతేకాకుండా, వీటి వేగం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మితిమీరిన వేగం వలన సంభవింటే ప్రమాదాలను కూడా తగ్గించడంలో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్ వంటి దేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఎలక్ట్రి, హైబ్రిడ్ వాహనాలు సక్సెస్‌ఫుల్‌గా రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.


Click it and Unblock the Notifications








