విలాసవంతమైన వాహనాలకు సబ్సిడి డీజిల్ అవసరం లేదు
డీజిల్ ఇంధనాన్ని గుటగుటామని మంచినీళ్ల ప్రాయంగా త్రాగేసే లగ్జరీ వాహనాల యజమానులకు ప్రభుత్వం త్వరలోనే పెద్ద షాక్ ఇవ్వనుంది. ప్రస్తుతం డీజిల్ ఇంధనాన్ని పెట్రోల్ ధరల మాదిరిగా కాకుండా ప్రభుత్వ నియంత్రణలతో సబ్సిడి ధరకే విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విలాసవంతమైన కార్లకు సబ్సిడి డీజిల్‌ను ఇవ్వరాదని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ఈయనకు మద్దతుగా వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఆనంద్‌శర్మ కూడా తన గొంతు కలిపారు.
ఎవరైనా వ్యక్తులు బిఎమ్‌డబ్ల్యు, బెంజ్, ఆడి వంటి విలాసవంతమైన కార్లు లేదా తక్కువ మైలేజీనిచ్చే ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్) నిర్వహించే స్తోమత కలిగి ఉన్నప్పుడు వారికి సబ్సిడి డీజిల్‌ను విక్రయించాల్సిన అవసరం ఏంటని రమేష్ ప్రశ్నించారు. సబ్సిడి క్రింద విక్రయించే డిజిల్‌ను కేవలం పేదలకు, బలహీన వర్గాల వారికి మాత్రమే అందించాలని, అలాగే, సబ్సిడీలన్నీ కూడా దారిద్య్రరేఖకు (బీపీఎల్) కు దిగువన ఉన్నవారికి బలహీన వర్గాల వారికి మాత్రమే ఇవ్వాలని, ఇవి నిజమైన లబ్ధి దారులకు మాత్రమే అందాలని అనంద్ శర్మ అన్నారు.
సాధారంగా అధిక మైలేజ్ ఇస్తుందన్న ఒకేఒక్క కారణంగా కొనుగోలుదారులు కాస్తంత ఖరీదైనా సరే డీజిల్ కార్ల వైపే మొగ్గు చూపుతుంటారు. సాధారణ ప్యాసింజర్ డీజిల్ కార్లు లీటర్ డీజిల్‌కు 15 కి.మీ. నుంచి 25 కి.మీ. పైగా మైలేజ్‌ను ఇస్తుంటాయి. అదే, విలాసవంతమైన కార్ల దగ్గరకు వచ్చేసరికి వాటిల్లో ఉపయోగించే పెద్ద ఇంజన్ల (అధిక సీసీ కలిగినవి) కారణంగా వీటి మైలేజ్ తక్కువగా ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే లక్షల్లో ఖరీదు చేసే కాస్ట్లీ కార్లను కొనుగోలు చేసి నిర్వహించే వారికి లీటర్ డీజిల్‌పై రూ.5-10 అధనంగా చెల్లించడం పెద్ద విషయమేమీ కాదనేది కొందరి భావన.
సబ్సిడి ధరకే డీజిల్, కిరోసిన్, ఎల్‌పిజి వంటి వాటిని అర్హులైన వారితో పాటుగా, అర్హులు కాని వారికి కూడా విక్రయించడం జరుగుతోంది. దీనిని మంత్రి జైరామ్ రమేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు గానూ ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసి, దశల వారీగా సబ్సిడిని ఎత్తివేసి అసలైన లబ్ధిదారులకు మాత్రం సబ్సిడి ధరకే ఇవి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో చమురు సబ్సిడీల క్రింద డీజిల్, కిరోసిన్, ఎల్‌పిజిలపై ప్రభుత్వం రూ.1,90,000 కోట్ల సబ్సిడి ఇస్తోంది.
మరోవైపు డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించేందుకు గానూ వాటిపై భారీ మొత్తాలలో ఎక్సైజ్ సుంఖాలను వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది. ఈ మేరకు భారత ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ డీజెల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే ప్రతిపాదనపై దృష్టి సారించినట్లు సమాచారం. వ్యక్తిగత వాహనాలకు వినియోగిస్తున్న సబ్సిడి డీజిల్ ఖర్చును తగ్గించేందకే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థికశాఖ మంత్రి వద్ద ఉందని, దీనిని త్వరలోనే ప్రణబ్ ముఖర్జీ పరిశీలించి, పలువురి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఓ నిర్ణయాన్ని తీసుకునే ఆస్కారం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) చైర్మన్ ఎస్ కె గోయెల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








