చైనా మార్కెట్ కోసం జిమ్నీ ఎస్‌యూవీని విడుదల చేసిన సుజుకి
మారుతి సుజుకి జిప్సీ గురించి ఇండియన్ కార్ లవర్స్‌కు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పట్లో ది బెస్ట్ ఆఫ్ రోడర్‌గా మిలటరీ వెహికల్‌గా పేరు తెచ్చుకున్న జిప్సీ ఎస్‌యూవీక ప్రస్తుతం ఆదరణ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో జిప్సీ పేరుతో అమ్ముడవుతున్న ఈ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్లో మాత్రం జిమ్నీ అనే పేరుతో లభ్యమవుతుంది.
మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇటీవలే జిమ్నీలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, స్టయిలిష్ లుక్, సరికొత్త ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని సుజుకి ప్రత్యేకించి చైనా మార్కెట్ కోసం అభివృద్ధి చేసింది. అయితే, సుజుకి జిమ్నీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అంశంపై కంపెనీ నోరు మెదపలేదు. చైనా మార్కెట్లో విడుదలైన సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ ధరలు రూ.12.2 లక్షల నుంచి రూ.13.6 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.
మార్కెట్ అంచనాల ప్రకారం, సుజుకి జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందకంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన ఓ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ 'మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా'ను కంపెనీ గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
అప్‌గ్రేడెడ్ జిప్సీ స్థానంలో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి ఇండియాకు పరిచయం చేయనుంది. మారుతి సుజుకి ఆవిష్కరించిన ఎక్స్ఏ ఆల్ఫా కాన్సెప్ట్ కారు దాదాపుగా ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కొత్త మోడళ్లతో రాకతో ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి అడుగు పెట్టనున్న మారుతి సుజుకి ఈ సెగ్మెంట్లోని అవకాశాలన్నింటినీ ఎర్టిగా మాదిరిగా ఊడ్చుకుపోవటం ఖాయమని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications









