స్విఫ్ట్, డిజైర్ కార్లు బుకింగ్స్ కొనసాగుతాయి: మారుతి సుజుకి
మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా, ఈ ప్లాంట్‌లో తయారవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ సెడాన్ కార్ల ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్విఫ్ట్ కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారులు అధిక వెయిటింగ్ పీరియడ్ కారణంగా ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లను ఆశ్రస్తున్న నేపథ్యంలో, స్విఫ్ట్, డిజైర్ కార్లకు బుకింగ్‌లను నిలిపివేయలేదని, కొత్త బుకింగ్‌లను తీసుకోవడాన్ని కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది.
అయితే, ఈ కార్లకు వెయిటింగ్ పీరియడ్ మాత్రం స్వల్పంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మానేసర్ ప్లాంట్‌లో స్విఫ్ట్, డిజైర్ కార్ల స్టాక్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్‌కి సంబంధించి 10,000 కార్లు మాత్రమే రవాణాలో ఉన్నాయని కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయాంక్ పరీక్ తెలిపారు. అయితే, ఈ మోడల్స్ బుకింగ్‌ను ఆపబోమని, కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ మోడళ్లను సొంతం చేసుకోవాలంటే కస్టమర్లు ఇది వరకూ 2-3 నెలల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే, మానేసర్ ప్లాంటులో నెలకొన్న తాజా సంక్షోభంతో ఈ వెయిటింగ్ పీరియడ్ కాస్తా గరిష్టంగా 4-5 నెలల వరకూ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి డీలర్ల వద్దకు వచ్చే కస్టమర్లకు ప్రస్తుత పరిస్థితి గురించి వివరించినప్పటికీ కొనుగోలుదారులు ఈ కార్లను బుకింగ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
గడచిన సంవత్సరంలో పలుసార్లు సమ్మెలు జరిగినప్పుడు కూడా ఈ మోడళ్లకు బుకింగ్‌లను నిలిపివేయలేదని పారీక్ గుర్తు చేశారు. కాగా.. మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుత పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ, తమ ప్రత్యర్థి కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు డిస్కౌంట్లు, వివిధ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయని, అయితే తాము ఎలాంటి స్కీమ్‌లు ప్రవేశపెట్టకపోయినప్పటికీ, సంక్షోభ సమయంలో సైతం భారీ స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.
ప్రస్తుతం సుమారు 55,000 స్విఫ్ట్ కార్లు, 65,000 స్విఫ్ట్ డిజైర్ కార్లకు బుకింగ్‌లు పెండిగ్‌లో ఉన్నాయని, వీటిల్లో దాదాపు 80 శాతం డీజిల్ వెర్షనే ఉన్నట్లు ఆయన పారీక్ వివరించారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మరో రెండు మూడు రోజుల్లో మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి ప్రారంభమైన తక్షణమే ముందుగా పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను పూర్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం స్విఫ్ట్, డిజైర్ కార్లను కొనుగోలు చేయాలనుకునే (వేరియంట్‌ను బట్టి) కనీసం 4-6 నెలల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








