గాడిన పడిన నానో: జోరుగా సాగుతున్న అమ్మకాలు
టాటా మోటార్స్ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానోకు పూర్వవైభవం దక్కింది. గడచిన 2009లో మార్కెట్లోకి వచ్చిన టాటా నానో మొట్టమొదటిసారిగా అత్యధిక నెలవారీ అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది. నానో చరిత్రలో ఇది వరకెన్నడూ లేనివిధంగా ఒక్క నెలలో 10,475 యూనిట్ల నానో కార్లు అమ్ముడయ్యాయి. గతంలో అత్యధిక అమ్మకాల రికార్డు ఏప్రిల్ 2011లో (10,012 యూనిట్లు) నమోదైంది.
బడ్జెట్ అనంతరం కార్ల ధరలు పెరుగుతాయనే భయంతో పాటుగా, నానో అమ్మకాలు పెంచుకునేందుకు టాటా మోటార్స్ అందిస్తున్న ఏక్సేంజ్ బోనస్ ఆఫర్ వంటి వివిధ ప్రచార కార్యక్రమాలు నానో అమ్మకాలకు ఇంధనంలా పనిచేశాయి. దీంతో మార్చి 2012లో టాటా మోటార్స్ 10,475 నానో కార్లను విక్రయించి, మార్చి 2011లో నానో అమ్మకాలతో పోలిస్తే (8,707 యూనిట్లు) 20 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
అంతేకాకుండా టాటా మోటార్స్‌కు మార్చి మాసం మరో అద్భుతమైన మాసంగా చెప్పుకోవచ్చు. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా టాటా మోటార్స్ లక్ష యూనిట్ల నెలవారీ విక్రయాలను నమోదు చేసుకుంది. మార్చి 2011తో పోలిస్తే టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు (ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు కలిపి) 20 శాతం వృద్ధిని సాధించి 83,363 యూనిట్ల నుంచి 1,00,414 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications









