ఎనిమిది కాంపాక్ట్ కార్లను విడుదల చేయనున్న టొయోటా
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా మోటార్ కార్పోరేషన్, ప్రపంచపు అగ్రగామి కార్ మేకర్‌గా తన స్థానాన్ని నిలుపుకునేందుకు, అలాగే ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే 2015 నాటికి ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి మార్కెట్ల కోసం స్థానికంగా ఉత్పత్తి చేసే ఎనిమిది మోడళ్లను విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
కంపెనీ మొత్తం ప్రపంచ అమ్మకాలలో 50 శాతం వాటాను ఇలాంటి మార్కెట్ల నుండి పొందాలని టొయోటా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టొయోటాకు గ్లోబల్ మార్కెట్లో జనరల్ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీల నుండి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్న కార్లతో పెద్ద మార్కెట్ వాటాను దక్కించుకోవాలని టొయోటా నిర్ణయించింది. టొయోటా దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు ఎతియోస్ లివా కూడా మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. టొయోటా వేరొక బ్రాండ్ పేరుతో ఓ చవక కార్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టనుందని పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో, కంపెనీ వాటిని ఖండించింది. ప్రస్తుతానికి తాము చీప్ కార్లపై దృష్టి సారించడం లేదని, అది తమ విభాగం కాదని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. టొయోటా రూ.3.5 లక్షల నుండి రూ.4 లక్షల రేంజ్‌లో చిన్న కార్లను ఓ కొత్త బ్రాండ్ పేరుతో 2016 నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుందని పుకార్లు రావటం జరిగింది. కాగా.. ప్రస్తుతం చిన్న కార్ మార్కెట్లో గట్టి పోటీ వాతావరణ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. టొయోటా నుండి కొత్తగా రానున్న చిన్న కార్లు ఈ పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








