సన్ ఫిల్మ్‌లు తొలగించడానికి భారీగా వసూళ్లు..!
వాహనాలు టింటెడ్ గ్లాస్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ దేశపు అత్యున్నత న్యాయస్థానం తాజాగా కొత్త ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మే 19, దేశవ్యాప్తంగా ఉన్న వాహనాల అద్దాలపై ఉపయోగించిన సన్ ఫిల్మ్‌ను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానాలు కట్టడమే కాకుండా, లైసెన్స్‌ను సైతం కోల్పోవలసి వస్తుంది.
ఈ నేపథ్యంలో సన్‌ఫిల్మ్‌లు తొలగించడానికి ప్రైవేట్ వ్యక్తులు కారును బట్టి రూ.500 నుండి రూ.800 వరకూ వసూలు చేస్తున్నారు. సన్నపాటి పదునైన బ్లేడ్‌లను, అద్దాలను శుభ్రం చేసే ద్రవాన్ని ఉపయోగించి వీరు సన్ ఫిల్మ్‌లను తొలగిస్తున్నారు. మా ప్రతినిధి ఒకరు, సన్ ఫిల్మ్‌లను తొలగించే వ్యక్తిని ప్రశ్నించగా, గతంలో తాము కార్లకు సన్ ఫిల్మ్‌లను అతికించడమే తమ జీవనాధారమని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవనాధారంపై దెబ్బ కొట్టిందని వారు వాపోయారు. ఏదేమైనప్పటికీ, వాహనాలకు ఉపయోగించే టింటెడ్ గ్లాస్‌ల కారణంగా అక్రమాలు రేటు పెరిగి పోతుండటంతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇదే సమయంలో దేశ్యవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు సన్ ఫిల్మ్‌ల వాడకంపై నిషేధం గురించి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారాలు సాగిస్తున్నారు.
టెలివిజన్లు, బ్యానెర్లు, హోర్డింగ్‌ల ద్వారా దీనిపై భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ కార్లను ట్రాఫిక్ పోలీసు బూత్ వద్దకు కానీ లేదా తాము ప్రత్యేకంగా ఏర్పాటు చేసే క్యాంప్‌కు గానీ తీసుకువచ్చినట్లయితే, ఉచితంగా సన్ ఫిల్మ్‌లను తొలగిస్తామని పోలీసులు చెబుతున్నారు. మే 19, 2012 తర్వాత నుండి సన్ ఫిల్మ్‌లు కలిగిన కార్లపై మొదటి తప్పుగా రూ.100 జరిమానా, రెండవ తప్పుగా రూ.300 జరిమానా, మూడవ తప్పుగా రూ.500 వరకూ జరిమానా ప్లస్ లైసెన్స్ రద్దు వంటి శిక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.
"మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు మరియు వెనుక వైపు కారు అద్దాలు) 70 శాతం మాత్రమే టింట్ చేయబడాలి. అలాగే, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 శాతం పారదర్శకతను కలిగిన టింట్/సన్‌ఫిల్మ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ టింట్ చేసినట్లయితే, అది మోటార్ వాహన చట్టాన్ని ఉల్లఘించబడినట్లుగా గుర్తించి, ట్రాఫిక్ పోలీసుల చే జరిమానాను ఆహ్వానించబడుతుంది."
అయితే, కార్లకు ఉపయోగించిన సన్ ఫిల్మ్‌ల యొక్క పారదర్శకతను గుర్తించేందుకు మన దేశంలో సరైన సాంకేతి వ్యవస్థ పెద్దగా అందుబాటులో లేదు. అదే విదేశాల్లో అయితే, ఓ ఎలక్ట్రానిక్ మీటర్ సహాయంతో సన్ ఫిల్మ్‌ల యొక్క పారదర్శకతను గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తమ కార్లకు ఉపయోగించే సన్‌ఫిల్మ్‌లు నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ, కొందరు ట్రాఫిక్ పోలీసులు దానిని గుర్తించకుండానే తొలగించి వేస్తున్నారని వాహన చోదకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications









