నెలకు ఐదు వేల ఎక్స్‌యూవీ500ల ఉత్పత్తి: మహీంద్రా
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుండి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500"కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 5,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది.వచ్చే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఇది సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.
ఎక్స్‌యూవీ500 ఉత్పత్తిని క్రమక్రమంగా పెంచుతూ వస్తున్నామని, ప్రస్తుతం నెలకు 4,000 ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తున్నామని, రానున్న సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 5,000 యూనిట్లకు తీసుకువెళ్లనున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రవీణ్ షా వెల్లడించారు.
గతేడాది సెప్టెంబర్ 29న విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ500, దాని సరమైన ధర, విలాసవంతమైన ఫీచర్ల కారణంగా మార్కెట్లో అశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఈ మోడల్ విడుదలైన కొత్తల్లో అనూహ్యరీతిలో బుకింగ్‌లు వస్తుండటంతో తాత్కాలికంగా వీటి బుకింగ్‌లను కంపెనీ నిలిపివేసింది. కాగా.. ఈ ఏడాది జనవరి నెలలో కేవలం 10 రోజులు మాత్రమే బుకింగ్‌లను రీఓపెన్ చేయగా 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చి పడ్డాయి. దీంతో చేసేది లేక లాటరీ సిస్టమ్ ద్వారా కస్టమర్లను మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపిక చేసింది.
ఇప్పటికే తొమ్మిది నెలలకు సరిపడా ఎక్స్‌యూవీ500 ఉత్పత్తిని విక్రయించేశామని కంపెనీ తెలిపింది. కాగా.. ఇప్పుడు ఈ గ్లోబల్ మోడల్ కోసం మహీంద్రా అండ మహీంద్రా ఈ నెల 8వ తేదీ నుండి దేశవ్యాప్తంగా బుకింగ్‌లను పునఃప్రారంభించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500కు దేశీయ మార్కెట్ నుండే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్ల నుండి మంచి స్పందన వస్తుండటంతో.. ఆస్ట్రేలియన్, యూరోపియన్ మార్కెట్లలో ఈ మోడల్‌ను విక్రయించాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
వరల్డ్ క్లాస్ ఫీచర్లతో రూపొందించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డబ్ల్యూ6, డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500లో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 33 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు రూ.11.58 లక్షల నుంచి రూ.14.11 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








