బిఐసి ట్రాక్‌పై లాంబోర్గినీ కారులో చక్కర్లు కొట్టిన యువీ
చిన్నపాటి క్యాన్సర్ వ్యాధి కారణంగా గత కొద్ది కాలంగా క్రికెట్ దూరంగా ఉన్న ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేస్తున్నాడు. ఈ యువ ఆటగాడు క్రికెట్ కంటే ముందుగా కార్ రేస్‌లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బహ్రైన్‌లో జరిగిన కార్ రేస్‌కు హాజరైన యవరాజ్ సింగ్, తాజాగా గడచిన ఆదివారం గ్రేటర్ నోయిడాలో మొట్టమొదటిసారిగా ఇండియన్ గ్రాంప్ ప్రి ఫార్మలా వన్ రేస్‌కి ఆతిథ్యమిచ్చిన బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) రేస్ ట్రాక్‌పై తన లాంబోర్గినీ సూపర్‌కారులో జయ్.. జయ్.. మని చక్కర్లు కొట్టి అభిమానులను అలరించాడు.
యువరాజ్ సింగ్ వద్ద ఓ లాంబోర్గినీ ముర్సిలాగో (Lamborghini Murcielago) అనే సూపర్‌కారు ఉంది. ఇందులో 6.5 లీటర్ వి-12 డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 649 బిహెచ్‌పిల శక్తిని, 67.3 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ సూపర్ కారు కేవలం 3.8 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 340 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు. ఇది లీటరు పెట్రోల్‌కు కేవలం 3-5 కి.మీ. మైలేజిని మాత్రమే ఇస్తుంది.
ముర్సిలాగో సూపర్ కారును 2001-10 మధ్య కాలంలో లాంబోర్గినీ ఉత్పత్తి చేసేది. రెండు డోర్లు మాత్రమే కలిగి ఉండే ఈ కారులో ఇద్దరికి (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్) మాత్రమే చోటు ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ సూపర్ కారు ధర జస్ట్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మాత్రమే. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే, దీనికి అధనంగా పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కలుపుకుంటే సుమారు రూ.3 కోట్ల వరకూ ఉంటుంది.
యువీకి ఫాస్ట్‌గా వెళ్లే కార్లంటే చాలా ఇష్టం. అందుకే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ ఈ కారును యువీ దిగుమతి చేయించుకున్నాడు. ఏదేమైనప్పటికీ, యువీ పూర్తిగా కోలుకొని త్వరలోనే క్రికెట్ గ్రౌండ్‌పై పరుగులు పెడుతుంటే చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications









