2013 టాటా ఇండిగో ఈసిఎస్ వివరాలు వెల్లడి
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో ఈసిఎస్ సెడాన్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్తగా వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లు మంచి సక్సెస్‌ను సాధిస్తుండటంతో, ఈ సెగ్మెంట్లో పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు టాటా మోటార్స్ ఈ 2013 ఇండిగో ఈసిఎస్‌ను అభివృద్ధి చేసింది.
కొత్త 2013 టాటా ఇండిగో ఈసిఎస్ కారులో కాస్మోటిక్ మార్పులతో పాటు కొన్ని మెకానికల్ మార్పులను కూడా చేశారు. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, రీస్టయిల్డ్ బ్లాక్డ్ అవుట్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ రియర్ డిజైన్, ప్రీమియం లుక్ కోసం క్రోమ్ గార్నిష్, కొత్త 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో ఇది మరింత స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది.
ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇదివరకటి కారులో ఉన్న సిల్వర్ కలర్డ్ ప్లాస్టిక్ సెంటర్ కన్సోల్ స్థానంలో ఫౌక్స్ ఉడ్ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, ఎబోనీ బ్లాక్ కలర్‌లో డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, రీస్టయిల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త మ్యూజిక్ సిస్టమ్, బీజ్ ఫ్యాబ్రిక్ సీట్స్, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు చెప్పుకోదగినవి.
యాంత్రికపరమైన మార్పుల విషయానికి వస్తే, గేర్ షిఫ్టింగ్‌ను మరింత సున్నితంగా మార్చేందుకు గాను ఇందులో కొత్త 5-స్పీడ్ మ్యాన్యువల్ ఎఫ్-షిఫ్ట్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ కొత్త గేర్‌బాక్స్ వలన మెయింటినెన్స్ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కోసం ఇందులో డ్యూయో ఫ్లోట్ సస్పెన్షన్లను ఉపయోగించారు.
ఇక ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. డీజిల్ వేరియంట్‌లో 1.4 లీటర్ టిడిఐ (బిఎస్3) డీజిల్ ఇంజన్‌ను మరియు 1.4 లీటర్ కామన్ రెయిల్ టర్బో డీజిల్ (బిఎస్4) డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు, అలాగే పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. మరి ఈ కొత్త 2013 టాటా ఇండిగో ఈసిఎస్ సెడాన్‌పై ఓ కన్నేద్దామా..?








Click it and Unblock the Notifications








