2014 మినీ కూపర్ ఆవిష్కరణ: వేరియంట్స్, స్పెసిఫికేషన్స్
బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ ఎట్టకేలకు తమ కొత్త మూడవ తరం (థర్డ్ జనరేషన్) మినీ కూపర్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న మినీ కౌలే ప్లాంటులో ఈ కొత్త మినీ కూపర్‌ను విడుదల చేశారు.
మినీ బ్రాండ్ కార్లు కన్వర్టిబల్, క్లబ్‌మ్యాన్, కంట్రీమ్యాన్, పేస్‌మ్యాన్, కూపే మరియు రోడ్‌స్టర్ రూపాల్లో లభ్యమవుతాయి. ఈ బాడీ టైప్స్ అన్నింటికీ మూలం మినీ కూపర్ కావటం విశేషం. కాగా.. ఈ కొత్త 2014 మినీ కూపర్ కారును వచ్చే ఏడాది మార్చి నెలలో వాణిజ్య పరంగా విడుదల చేయనున్నారు.
అనంతరం, ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మరిన్ని అప్‌గ్రేడెడ్ కార్లను మినీ తయారు చేసే అవకాశం ఉంది. ఈ లోపుగా కొత్త 2014 మినీ కూపర్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

కొత్త మినీ కూపర్ మునుపటి వెర్షన్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. సెకండ్ జనరేషన్ మినీ కూపర్‌తో పోల్చుకుంటే ఈ థర్డ్ జనరేషన్ మినీ కూపర్ 98 మి.మీ. ఎక్కువ పొడవును, 44 మి.మీ. ఎక్కువ వెడల్పును, 7 మి.మీ. ఎక్కువ ఎత్తును మరియు 28 మి.మీ. ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉండనుంది. ఫలితంగా దీని బూట్ స్పేస్ కూడా 50 లీటర్లకు పైగా (211 లీటర్లు) పెరిగింది.

కొత్త మినీ కూపర్‌లో బేసిక్ డిజైన్‌ను యధాతథంగా ఉంచి, కాస్మోటిక్ అప్‌గ్రేడ్ చేశారు.

కొత్త మినీ కూపర్‌లో కొంచెం పెద్ద, బాక్స్ టైప్ గ్రిల్, రీడిజైన్డ్ హుడ్, రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ట్, వంటి మార్పులు చేర్పులు కనిపిస్తాయి.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో అనేక చిన్నపాటి మార్పులు చేర్పులు చేసారు. ప్రత్యేకించి కంట్రోల్ బటన్స్ పొజిషన్లలో మార్పులు చేశారు. ఉదాహర సెంటర్‌లో ఉన్న పవర్ విండో కంట్రోల్స్‌ను డోర్ ప్యానెల్స్ పైకి మార్చారు.

కొత్త మినీ కూపర్ కారు డ్యాష్ బోర్డుపై వృత్తాకారంలో ఉన్న సెంటర్ కన్సోల్‌పై సెమీ సర్క్యులర్ ఎల్ఈడి లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డ్రైవింగ్ మోడ్‌ను ఇవి బ్లూ, ఆరెంజ్, రెడ్ రంగులకు మారుతుతాయి.

ఈ కారులో మిడ్, స్పోర్ట్, గ్రీన్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. నావిగేషన్ విషయంలో కూడా ఈ ఎల్ఈడిలు ఉపయోగపడుతాయి. అంతేకాకుండా, ఇవి మీ కారును పార్క్ చేయటంలో కూడా సహకరిస్తాయి.

కొత్త 2014 మినీ మోడళ్లను యూకేఎల్1 అనే కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఫ్రంట్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. భవిష్యత్తులో ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఇతర చిన్న బిఎమ్‌డబ్ల్యూ వాహనాలను తయారు చేయనున్నారు.

కొత్త మినీ కూపర్ 3 విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అవి - 1.5 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ 3-సిలిండర్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఈ మూడు ఇంజన్లు మినీ యొక్క ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీ, డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీలను ఉపయోగించుకోనున్నాయి.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన మినీ కూపర్ గరిష్టంగా 134 హెచ్‌పిల శక్తిని, 219 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన మినీ కూపర్ డి గరిష్టంగా 114 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9.2 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

చివరగా, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన మినీ కూపర్ ఎస్ గరిష్టంగా 189 హెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కొత్త 2014 మినీ కూపర్ కార్లలోని ఇంజన్లు మూడు 6-స్పీడ్ ట్రాన్సిమిషన్లతో (ఒక మ్యాన్యువల్, ఒక ఆటోమేటిక్ మరియు ఒక డ్యూయెల్ క్లచ్ స్పోర్ట్స్ ఆటోమేటిక్) అనుసంధానం చేయబడనున్నాయి.

ఈ కొత్త మినీలో తర్వాతి తరం సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ఇందులో ప్రధానంగా హెడ్-అప్ డిస్‌ప్లే, కొల్లైజన్ అండ్ పెడస్టేరియన్ వార్నింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి.

మరో రెండు మూడు వారాల సమయంలో కొత్త 2014 మినీ కూపర్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. మార్చ్ 2014లో ఇది వాణిజ్య పరంగా విడుదల కానుంది. కొత్త మినీ ధరలు ఇలా ఉన్నాయి:
* కూపర్ - 15,300 యూరోలు
* కూపర్ డి - 16,450 యూరోలు
* కూపర్ ఎస్ - 18,650 యూరోలు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మినీ ఈ కొత్త కూపర్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








