2015 హ్యుందాయ్ ఐ20 కూపే ఆవిష్కరణ; ఇండియాకు వస్తుందా?
కొరియన్ కార్ హ్యుందాయ్, ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త ఎలైట్ ఐ20 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అత్యంత ఆకర్షనీయమైన డిజైన్‌తో రూపుదిద్దుకున్న హ్యుందాయ్ ఎలైట్ ఐ10 కస్టమర్లను ఫస్ట్ లుక్‌లోనే అట్రాక్ట్ చేస్తోంది.
ప్రస్తుతం మనదేశంలో లభిస్తున్న ఎలైట్ ఐ20 ఓ గ్లోబల్ మోడల్. మనదేశంలోనే కాదు పలు అంతర్జాతీయ మార్కెట్లలోను ఈ మోడల్ ఇదే రూపంలో లభ్యమవుతోంది. అయితే, ఇందులో ఇప్పటి వరకూ ఫైవ్-డోర్ వెర్షన్ మాత్రమే లభ్యమవుతోంది.
కాగా.. ఇందులో హ్యుందాయ్ ఐ20లో త్రీ-డోర్ వెర్షన్ కూపే మోడల్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ఫొటోలను కూడా హ్యుందాయ్ విడుదల చేసింది. హ్యుందాయ్ తమ 3-డోర్ ఐ20 మోడల్‌ని ఈ ఏడాది మార్చ్-ఏప్రిల్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయాలని యోచిస్తోంది.
మరి ఈ సరికొత్త 3-డోర్ హ్యుందాయ్ ఐ20 కారుకి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

ఈ 3-డోర్ వెర్షన్ 2015 ఐ20 మోడల్‌ను 'హ్యుందాయ్ ఐ20 కూపే' అని పిలవొచ్చని సమాచారం. ఈ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ యూరోపియన్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు.

రెగ్యులర్ ఫైవ్-డోర్ వెర్షన్ ఐ20 మోడల్‌ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్త త్రీ-డోర్ వెర్షన్ ఐ20ని డిజైన్ చేశారు. అయితే, త్రీ-డోర్ నిర్మాణం కోసం అన్ని పిల్లర్లను ఆల్టర్ చేశారు. ఫలితంగా దీని రూఫ్‌లైన్ ఫైవ్-డోర్ వెర్షన్ కన్నా దాదాపు 25 మి.మీ. తక్కువగా ఉంటుంది.

అయితే, ఈ మార్పు వలన త్రీ-డోర్ వెర్షన్ ఐ20లో ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ఫైవ్-డోర్ వెర్షన్ ఐ20తో పోల్చుకుంటే త్రీ-డోర్ వెర్షన్ ఐ20 బూట్ స్పేస్ 10 లీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీని మొత్తం బూట్ స్పేస్ 336 లీటర్లు.

హ్యుందాయ్ ఐ20 కూపే (3-డోర్ వెర్షన్) రెండు పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ ఇంజన్లు యూరో-6 నిబంధనలను పాటించనున్నాయి.

పెట్రోల్ వెర్షన్‌లో 83 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.25 లీటర్ ఇంజన్‌ను మరియు 99 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

డీజిల్ వెర్షన్‌లో 74 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.1 లీటర్ ఇంజన్‌ను మరియు 83 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

ఈ కొత్త హ్యుందాయ్ ఐ20 కూపే మోడల్‌ను టర్కీలో ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. మరి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తుందంటారా?


Click it and Unblock the Notifications








