భారత్‌లో అమ్ముడయ్యే 40 శాతం స్పేర్ పార్ట్స్ నకిలీవే!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో నకిలీ స్పేర్ పార్ట్స్ తయారు చేసే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఫలితంగా, నాణ్యత లేని నకిలీ స్పేర్ పార్ట్స్ ఉపయోగించి, ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్ (ఏసిఎమ్ఏ) విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
ఏసిఎమ్ఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 5 స్పేర్ పార్ట్‌లలో 2 నకిలీవని (దాదాపు 30-40 శాతం) తేలింది. రీటైల్ అవుట్‌లెట్లలో విక్రయించబడుతున్న ఈ నకిలీ స్పేర్ పార్ట్‌ల విక్రయం వలన వాటిని తయారు చేసే కంపెనీలు మొత్తంగా మార్చ్ 2014 నాటికి దాదాపు 35,000 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు సమాచారం.
కొనుగోలుదారులు కూడా ధర తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో, నాణ్యత ప్రమాణాలను పక్కనపెట్టి నకిలీ స్పేర్ పార్ట్‌లనే కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు ఏవి నకిలీవో ఏవి అసలైనవో తెలియక కొనుగోలు చేస్తున్నారు. ఏదైతేనేం, ఈ నకిలీ స్పేర్ట్ పార్ట్స్‌తో వాటిని తయారు చేసేవారు కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ, ప్రయాణీకుల భద్రతకు ముప్పు తెచ్చిపెడుతున్నారు.

నకిలీ స్పేర్ పార్ట్స్‌లలో అత్యధికంగా క్లచ్, ఫిల్టర్ ల్యాంప్స్, వైపర్స్, బేరింగ్స్, స్టీరింగ్ ఆర్మ్, బ్రేక్స్ అండ్ బ్రేక్ లైనింగ్స్ మొదలైన అనేక వస్తువులు ఉన్నాయి. ప్యాసింజర్ కార్స్, చిన్నా పెద్ద వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఇలా అన్ని రకాల ఆటోమొబైల్ వాహనాల కోసం ఈ నకిలీ స్పేర్ పార్ట్స్‌ను తయారు చేస్తున్నారు కొందరు నీతిమాలిన తయారీదారులు.
స్పేర్ పార్ట్స్ వలన ఇటు ప్రజలే కాకుండా అటు ప్రభుత్వం కూడా భారీగా నష్ట పోతోంది (సాలీనా రూ.2,200 కోట్ల మేర పన్ను ఆదాయ నష్టం ఏర్పడుతున్నట్లు అంచనా). నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20 శాతం ప్రమాదాలు ఈ నకిలీ స్పేర్ పార్ట్స్ ఉపయోగించడం వల్లనే జరుగుతున్నట్లు ఏసిఎమ్ఏ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కాబట్టి, వినియోగదారులారా.. ఇకనైనా మేల్కొని, ఇలాంటి నకిలీ స్పేర్ పార్ట్స్‌ను ఉపయోగించడం మానేసి, వాటిని తయారుచేసే నకిలీగాళ్ల ఆటలకు చెక్ పెట్టండి. నాణ్యత ఉండని నకిలీ స్పేర్ పార్ట్స్ వాడటం వలన మీ భద్రతను మీరే రిస్కులో పెట్టుకున్న వారవుతారని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications








