భారత్‌లో ఆడి ఏ8ఎల్ విడుదల; ధర, వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి మరోసరికొత్త సూపర్ లగ్జరీ కారును భారత్‌లో విడుదల చేసింది. సరికొత్త ఆడి ఏ8ఎల్ (Audi A8L) లగ్జరీ సెడాన్‌ను ఆడి ఇండియా దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఆడి బ్రాండ్ స్టైలింగ్, మోడ్రన్ టెక్నాలజీ, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇంటీరియర్స్ వంటి పలు విలాసవంతమైన అంశాలతో ఈ కొత్త ఆడి ఏ8ఎల్ కారును తయారు చేశారు.
కొత్త ఆడి ఏ8ఎల్ సెడాన్ విడుదలతో తాము భారత లగ్జరీ కార్ మార్కెట్లో తమ నాయకత్వ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోగలమని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఆడి ఏ8ఎల్ కస్టమర్లకు కంపెనీ అనంతమైన కస్టమైజ్ ఆప్షన్లను ఆఫర్ చేస్తోంది. ఈ కారును కొనుగోలు చేయదలచిన వారు, ఇందులో ప్రతి అంశాన్ని తమకు నచ్చిన విధంగా మలచుకునే వెసలుబాటు ఉంటుంది.

ఈ కస్టమైజ్ ఆప్షన్లలో 111 రకాల ఎక్స్టీరియర్ కలర్స్, 23 రకాల లెథర్ కలర్స్, 27 కస్టమైజబల్ పార్ట్స్, 12 ఉడెన్ ఇన్‌లేస్ మొదలైనవి ఉన్నాయి. హెడ్‌రెస్ట్ లోగో, డోర్ సిల్ ట్రిమ్స్, ఎక్స్‌క్లూజివ్ ఫోల్డింగ్ టేబుల్స్ వంటి వాటిని కూడా వినియోగాదరులు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆడి ఏ8ఎల్ సెడాన్‌లో అధునాతన హెడ్‌ల్యాంప్ 966,105,422 రకాల ఇల్యుమినేషన్ కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది.
ఆడి డ్రైవ్ సెలక్ట్‌తో కూడిన అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆప్షనల్ రియర్ సీట్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్, బ్యాంగ్ అండ్ ఓల్యూఫ్సెన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్, సరౌండ్ వ్యూ కెమెరా, పానారోమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ఐయోనైజర్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆడి వైర్‌లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ మొదలైన అనేక కంఫర్ట్ ఫీచర్లతో ఈ కొత్త ఆడి ఏ8ఎల్ కారు మంచి సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతినిస్తుంది.

ఆడి ఏ8ఎల్ కారు మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒకటి పెట్రోల్, రెండు డీజిల్. పెట్రోల్ వెర్షన్‌లో 4.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ వి8 బైటర్బో ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది గరిష్టంగా 435 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 3.0 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది గరిష్టంగా 250 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరొక డీజిల్ వెర్షన్‌లో 4.2 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది గరిష్టంగా 385 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటాయి.
ఆడి ఏ8ఎల్ ప్రారంభ ధర రూ.1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








