2020 నాటికి అన్ని ఆడి కీలక మోడళ్లలో హైబ్రిడ్ వెర్షన్స్
భవిష్యత్తులో హైబ్రిడ్ కార్లదే హవా కానుంది. ఈ నేపథ్యంలో, దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఆ దిశగా అడుగులు వేస్తూ హైబ్రిడ్ కార్లను తయారు చేసే పనిలోపడ్డాయి. ప్రమఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి కూడా 2020 నాటికి తమ అన్ని కీలక మోడళ్లలోను హైబ్రిడ్ వెర్షన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ విషయాన్ని ఆడి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ ఉల్రిచ్ హాకెన్‌బర్గ్ వెల్లడించారు. ఆడి ఏ3 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కారును విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కారు ఇతర ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లకు ఓ బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.
ఆడి ఇప్పటికే రెండి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్లను అభివృద్ధి చేస్తోందని, భవిష్యత్తులో ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే మోడళ్లలో కూడా ఏ3 ఈ-ట్రాన్‌ను ప్రతిభింభింపజేసేలా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలను ఆఫర్ చేస్తామని ఆయన తెలిపారు.

ఈ హైబ్రిడ్ కార్లలో ఓ 1.4 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఇంజన్ నుంచి వచ్చే శక్తిని ముందు చక్రాలకు బదిలీ చేస్తుంది.
హైబ్రిడ్ వెర్షన్లలో కేవలం టూ-వీల్ డ్రైవ్ మోడళ్లు మాత్రమే కాకుండా, ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే ఫోర్-వీల్ డ్రైవ్ మోడళ్లలో కూడా ఈ పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సెటప్‌ను ఆఫర్ చేయాలనుకుంటున్నామని హాకెన్‌బర్గ్ వివరించారు.


Click it and Unblock the Notifications








