బిఎమ్‌డబ్ల్యూ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు 'బిఎమ్‌డబ్ల్యూ ఐ3' విడుదల
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ కారును ఆసియా, యూరప్, అమెరికా ఖండాల్లో ఒకేసారి ఆవిష్కరించింది. 'బిఎమ్‌డబ్ల్యూ ఐ3' (BMW i3) పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ భవిష్యత్తులో భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
భారత మార్కెట్లో ఈ కారుకు మంచి అవకాశాలున్నాయని, లండన్‌లో ఈ ఏడాది చివరి నాటికి, అమెరికాలో వచ్చే ఏడాది ఆరంభం నాటికి బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కార్ల విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ కారును భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి తెచ్చే విషయాన్ని ప్రస్తుతం చెప్పలేమని కంపెనీ వివరించింది.
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, దీని సాంకేతిక ఫీచర్ల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

ప్యూర్ ఎలక్ట్రిక్ కారు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ కారును ఆసియా, యూరప్, అమెరికా ఖండాల్లో ఒకేసారి విడుదల చేసింది.

గ్లాస్ డోర్లు లేవు
ఇది ప్రొడక్షన్ వెర్షన్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో గ్లాస్ డోర్లు లేవు, వాటి స్థానంలో సాంప్రదాయ డోర్లను అమర్చారు. వీటిని మరింత వెనుకగా ఉంచి, తక్కువ సైజులో ఉండేలా అభివృద్ధి చేశారు.

డిజైన్
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఆకర్షనీయమైన కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనుక డోర్ గ్లాస్ విండో ఫ్రంట్ డోర్ గ్లాస్ విండో కన్నా కాస్తంత దిగువన ఉంటుంది.

బి పిల్లర్ లేదు
ఈ కారులో బి పిల్లర్ ఉండదు. దీని ఫ్రండ్ డోరు ముందు వైపుకు, బ్యాక్ డోర్ వెనుక వైపుకు తెరుచుకునేలా డిజైన్ చేశారు. దీని వలన కారులోకి ప్రయాణికులు సులువుగా ప్రవేశేంచుందుకు, బయటకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది.

ఫోర్ సీటర్ కారు
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఒక ఫోర్ సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో నలుగురు ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) హాయిగా ప్రయాణించవచ్చు.

ఇంజన్ (ఎలక్ట్రిక్ మోటార్)
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కారులో 170 హార్స్‌పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఆప్షనల్‌గా 650సీసీ, 2-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది.

పెర్ఫామెన్స్
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కేవలం 3.7 సెకండ్లలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని, 7.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

గరిష్ట వేగం
మైలేజ్ (రేంజ్)ను దృష్టిలో ఉంచుకొని బిఎమ్‌డబ్ల్యూ ఐ3 గరిష్ట వేగాన్ని పరిమితం చేశారు. దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు మాత్రమే.

లిథియం అయాన్ బ్యాటరీ
ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కారులో అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. క్విక్ ఛార్జర్ సాయంతో అర్థగంటలో ఈ బ్యాటరీ దాదాపు 80 శాతం ఛార్జ్ అవుతుంది (50 కి.వా.).

ఛార్జింగ్‌కు పట్టే సమయం
సాధరణంగా ఇళ్లలో వినియోగించే విద్యుత్ సాయంతో ఈ బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయటానికి 8 గంటల సమయం పడుతుంది. అయితే, బిఎమ్‌డబ్ల్యూ ఐ వాల్‌బాక్స్ హోమ్ ఛార్జర్‍ను ఉపయోగించుకుంటే కేవలం 6 గంటల్లోనే ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

రేంజ్
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కారును పూర్తిగా ఛార్జ్ చేసుకుంటే, 130 కిలోమీటర్ల నుండి 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. (ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై మాత్రమే).

రేంజ్ ఎక్స్టెండర్ ఆప్షన్
ఎక్కువ దూరం ప్రయాణించగోరే కస్టమర్లు రేంజ్ ఎక్స్టెండర్ మోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

రేంజ్ ఎక్స్టెండర్ ఆప్షన్ అంటే ఏంటి?
రేంజ్ ఎక్స్టెండర్ ఆప్షన్‌లో భాగంగా, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (కంపెనీ ద్విచక్ర వాహన విభాగం) నుంచి గ్రహించిన ఓ 650సీసీ 2-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఈ కారులో అమర్చుతారు. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 9 లీటర్లు. బ్యాటరీ, పెట్రోల్ పవర్‌తో ఈ కారులో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

లైట్ వెయిట్, రీసైకిల్
బిఎమ్‌డబ్ల్యూ ఐ3ని తేలిక రకం అల్యూమినియం చాసిస్‌పై కార్బన్ ఫైబర్, రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్‌తో తయారు చేశారు. దీని బరువు 1195 కిలోలు మాత్రమే. ఇందులో బ్యాటరీ బరువే 230 కిలోలు ఉంటుంది. ఈ కారులో 80 శాతానికి పైగా భాగాలను రీసైకిల్ చేసుకోవచ్చు.

ఇంటీరియర్స్
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కారు లోపల బైరేడియన్ స్టీరింగ్ వీల్, రెండు డిజిటల్ డిస్ప్లేలు, వుడ్ ప్యానెలింగ్, ఐడ్రైవ్ సర్క్యూట్ బ్రేకర్, మెటాలిక్ డెకరేషన్స్‌ను గమనించవచ్చు.

ధర
అమెరికాలో దీని ధర 41,350 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.24.8 లక్షలు). దీన్ని భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.

భారత్‌లో మౌలిక సదుపాయాలు లేవు
ఇలాంటి అధునాతన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు భారతదేశంలో సరైన మౌలిక సదుపాయాలు లేవని, ముందుగా వాటిని అభివృద్ధి చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఈ కారును అభివృద్ధి చేసినట్లు కంపెనీ వివరించింది.

వచ్చే ఏడాది బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్
వచ్చే ఏడాదిలో బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.
BMW i3 Being Unveiled
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 విడుదల వీడియో
BMW i3 Concept Coupe
బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కాన్సెప్ట్ కూపే వీడియో


Click it and Unblock the Notifications








