కార్ ఎయిర్‌బ్యాగ్ వల్ల కంటిచూపు కోల్పోయిన టీనేజ్ గర్ల్!
అదేంటి ఎయిర్‌బ్యాగ్‌ల వలన ప్రాణాలు దక్కుతాయంటారు, కానీ ఇక్కడ కంటిచూపు కోల్పోవటం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇప్పటివరకు ఇలాంటి విచిత్రమైన కేసు నమోదు కాలేదు. కారు యాక్సిడెంట్‌లో ఓ 17 ఏళ్ల యువతి తన కంటిచూపును కోల్పోయింది.
ఇందుకు ప్రధాన కారణం, ఎయిర్‌బ్యాగ్ కనురెప్ప ఆర్పే సమయంలోపే విచ్చుకోవటమే. వివరాల్లోకి వెళితే, మిచిగాన్‌లో ఓ టీనేజర్ కారు ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో కూర్చుని వెళ్తుండగా, హఠాత్తుగా ఆ కారు దానికి ముందున్న కారును ఢీకొట్టడంతో ఎయిర్‌బ్యాగ్ మిల్లీ సెకండ్ల వ్యవధిలో విచ్చుకుంది. దీంతో ఆమె కనురెప్ప మూసే వ్యవధిలోనే ఎయిర్‌బ్యాగ్ మెష్ నేరుగా ఆమె కనుగుడ్లను తాకింది.

ఈ యాక్సిడెంట్ సమయంలో కారులోని టీనేజర్ సీట్ బెల్ట్ ధరించి ఉంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కానీ టీనేజర్ కళ్లు మండుతున్నాయని, కంటిచూపు మందగించిందని ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్ష చేసిన తర్వాత ఆమె కంటిలోని నల్లగుడ్డుపై ఎయిర్‌బ్యాగ్ మెష్ ముద్ర ఉండటాన్ని గుర్తించారు. ఆమె సైట్ చేయగా కుడికన్ను 20/20, ఎడమ కన్ను 20/25గా ఉందని వైద్యులు తేల్చారు.
ఆమె కళ్లలోని కార్నియాపై ఫ్లోరెసెండ్ డై ఉంచి, బ్లూ ఫిల్టర్ ద్వారా చూసినప్పుడు కనుగుడ్డుపై ఏర్పడిన మెష్ ముద్రను వైద్యులు స్పష్టంగా చూడగలిగారు. ఎయిర్‌బ్యాగ్ రెప్పపాటు సమయం కంటే ముందుగానే విచ్చుకోవటం వలన ఆమె తన కను రెప్పలు మూయలేకపోయిందని, ఫలితంగా ఎయిర్‌బ్యాగ్ మెష్ నేరుగా కనుగుడ్డును తాకటంతో ఆమె దృష్టిని కోల్పోయిందని వెద్యులు చెప్పారు.

మాగ్నిఫైడ్ వ్యూలో ఆమె కళ్లను చూసినప్పుడు కార్నియాపై అసాధరణమైన ముద్రను గుర్తించామని, అది ఎయిర్‌బ్యాగ్ కవర్ యొక్క నైలాన్ మెష్ ప్యాటర్న్‌లా కనిపించిందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కంటి వైద్య నిపణులు డా. జోనాథన్ ట్రోబ్ తెలిపారు. ఆమె కళ్లు మూసుకునే సమయం కంటే ముందుగానే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవటం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అదృష్టవశాత్తు, ఆమెకు రెండు వారాలు చికిత్స చేసిన తర్వాత తిరిగి తన కంటిచూపును పొందగలిగిందని సమచారం. గతంలో జనరల్ మోటార్స్ కూడా తమ క్రూజ్ కారులోని ఎయిర్‌బ్యాగ్ తప్పు మార్గంలో విచ్చుకోవటం ఓ మహిళ ఒక కంటి చూపును కోల్పోవటంతో దాదాపు 33,000 షెవర్లే క్రూజ్‌లను రీకాల్ చేసిందట. హోండా, మజ్దా, నిస్సాన్ వంటి కంపెనీలు కూడా ఎయిర్‌బ్యాగ్ సమస్య వలన తమ వాహనాలను రీకాల్ చేసిన దాఖలాలున్నాయి. ఏదేమైనప్పటికీ, ఎయిర్‌బ్యాగ్ వలన కంటిచూపు పోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.



Click it and Unblock the Notifications








