షెవర్లే బీట్, సెయిల్ మాంచెస్టర్ యునైటెడ్ ఎడిషన్ విడుదల
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా (జిఎమ్), దేశీయ విపణిలో విక్రయిస్తున్న షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్ మరియు షెవర్లే సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో రెండు స్పెషల్ ఎడిషన్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
ప్రముఖ ఇంగ్లిష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పురస్కరించుకొని, ఈ రెండు మోడళ్లలో 'మాంచెస్టర్ యునెటైడ్ లిమిటెడ్ ఎడిషన్' పేరిట షెవర్లే బీట్, సెయిల్ యువా మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

మాంచెస్టర్ యునెటైడ్ ఫుట్‌బాల్ టీమ్ జెర్సీలపై షెవర్లే బ్రాండ్‌ను చేర్చిన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జనరల్ మోటార్స్ తెలిపింది. రెగ్యులర్ ఎల్ఎస్ వేరియంట్లను ఆధారంగా చేసుకొని ఈ స్పెషల్ ఎడిషన్లను అందిస్తున్నారు. షెవర్లే బీట్, సెయిల్ యువా మాంచెస్టర్ యునైటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.
ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు రెడ్ కలర్‌లో మాంచెస్టర్ యునైటెడ్ బ్రాండింగ్‌తో లభ్యం కానున్నాయి. ఇవి ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటాయి. ఈ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, స్పెషల్ సీట్ కవర్స్, మ్యూజిక్ సిస్టమ్, ప్రకాశించే డోర్ సిల్ ప్లేస్ట్, ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, రూడ్ రెయిల్స్, ఎక్స్‌క్లూజివ్ బ్రాండింగ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

రెగ్యులర్ వేరియంట్లతో పోల్చుకుంటే వీటి ధరలు రూ.69,000 అధికంగా ఉంటాయని కంపెనీ వివరించింది. దేశీయ విపణిలో ప్రస్తుతం రెగ్యులర్ బీట్ ఎల్‌ఎస్ వేరియంట్‌లో పెట్రోల్ కారు ధర రూ.4.22 లక్షలుగా ఉంటే, డీజిల్ కారు ధర రూ.5.05 లక్షలుగా ఉంది. అలాగే, సెయిల్ ఎల్‌ఎస్ వేరియంట్ పెట్రోల్ కారు ధర రూ.4.72 లక్షలుగా ఉంటే, డీజిల్ కారు ధర రూ.5.86 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








