ఆటో ఎక్స్‌పో 2014: డిసి డిజైన్స్ నుంచి 2 కొత్త కార్లు
భారతదేశపు ప్రీమియర్ ఆటోమోటివ్ డిజైన్ అండ్ స్పెషలిస్ట్ కార్ మ్యానుఫాక్చరర్ డిసి డిజైన్, ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో రెండు సరికొత్త కాన్సెప్ట్ కార్లను ఆవిష్కరించింది. ఇందులో ఓ ఎస్‌యూవీ మరియు ఓ స్మాల్ కార్ ఉన్నాయి. ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను డిసి డిజైన్ తమ స్టాల్‌కు ఆహ్వానించింది.
డిసి ఎలెరాన్ ఎస్‌యూవీ మరియు డిసి టియా స్మాల్ కార్లు 2016 నాటికి ఉత్పత్తి దశకు చేరుకోనున్నాయి. ఫ్యూచరిస్టిక్ డిజైన్, మోడ్రన్ స్టయిలింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్లతో ఈ కార్లను తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. డిసి ఎలెరాన్ ఒక ఓపెన్ టార్గా టాప్డ్ ఎస్‌యూవీ. ఇది రాడికల్ లైన్స్ కలిగి ఉంటుంది. డిసి టియా ఒక టూ-సీటర్ స్మాల్ సిటీ కార్.

డిసి డిజైన్ ఫౌండర్ దిలీప్ ఛాబ్రియా మరియు బాలీవుడ్ నటి కరీనా కపూర్‌లు ఈ వాహనాలను ఆవిష్కరించారు. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో ప్రపంచంలో కెల్లా అత్యుత్తమైన కార్లను తయారు చేయాలని తాను ఎల్లప్పుడూ అనుకునే వాడినని, గడచిన రెండేళ్ల క్రితం తాము విడుదల చేసిన డిసి అవంతి కారును ఈ ఏడాది మూడవ త్రైమాసికం నుంచి సాలీనా 2000 యూనిట్ల చొప్పున తయారు చేయాలని భావిస్తున్నామని దిలీప్ చాబ్రియా తెలిపారు.

కాగా.. 2016 నాటికి సాలీనా 500 యూనిట్ల ఎలెరాన్ ఎస్‌యూవీని మరియు 1000 యూనిట్ల టియా కార్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని వివరించారు. అవంతి ఉత్పత్తి కోసం ఇప్పటికే రూ.85 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని, అలాగే ఎలెరాన్ మరియు టియా మోడళ్ల ఉత్పత్తి కోసం చెరి రూ.50 కోట్లు వెచ్చించామని దిలీప్ చాబ్రియా తెలిపారు. అయితే, ఈ రెండు కార్లకు సంబంధించిన ఇంజన్, పెర్ఫామెన్స్ వంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








