రానున్న 12 నెలల్లో డీజిల్ ధరకు స్వేచ్ఛ: మూడీస్
రానున్న 12 నెలల్లో డీజిల్ ధరకు పూర్తి స్వేచ్ఛ లభించనుంది. డీజిల్ ఇంధనాన్ని కొనుగోలు చేసిన రేటు కన్నా తక్కువ రేటుకు విక్రయిస్తున్నందున ప్రభుత్వం అధనపు భారం పడుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఈ భారాన్ని పూర్తిగా లేకుండా చేసేందుకు మోడీ సర్కారు డీజిల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది.
డీజిల్‌పై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయడానికి మరో 12 నెలల పాటు సమయం పట్టవచ్చునని, అప్పటి వరకు నెలకు డీజిల్‌పై లీటరకు 50 పైసల చొప్పున (పన్నులు కలుపుకోకుండా) పెంచుకుంటూ నష్టాలను తగ్గించుకుంటూ పోతారని ఆ ఏజెన్సీ తెలిపింది. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల)ను అదుపు చేయడం ప్రస్తుతం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం క్రమంగా పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడి భారాన్ని తగ్గించుకుంటూ పోవాలనే యోచనలో ఉందని మూడీస్ వైస్ ప్రసిడెంట్ , సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ వికాస్ హాలాన్ అన్నారు. కాగా.. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం నిర్నయించిన ధరల ప్రకారమే పెట్రోలియం ఉత్పత్తుల విక్రయించడం వలన మార్చి 2015 నాటికి రూ.1,10,000 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.

డీజిల్ ధరపై నియంత్రణ ఎత్తివేస్తే ఏం జరుగుతుంది..?
గతంలో పెట్రోల్ ధరపై నియంత్రణ ఎత్తివేసినట్లుగానే, డీజిల్ ధరపై కూడా నియంత్రణ ఎత్తివేస్తే ఆ ఇంధన ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వం చేతి నుంచి చమురు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం డీజిల్ ధర నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే, డీజిల్ ధరను ప్రతినెలా పెంచకుండా ఆపవచ్చు. కానీ, తమపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వానికి వేరే మార్గం లేక ప్రతినెలా 50 పైసల చొప్పున పెంచుకోమని చమురు కంపెనీలను సూచించింది.
అదే డీజిల్ ధరకు పూర్తిగా స్వేచ్ఛ కల్పిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లలోని రేట్ల ప్రకారం అక్కడ రేట్లు పెరిగితే ఇండియన్ మార్కెట్లో డీజిల్ రేటును పెంచడం లేదా అక్కడ రేట్లు తగ్గితే ఇండియన్ మార్కెట్లో డీజిల్ ధరను తగ్గించడం జరుగుతుంది. ఇదంతా పూర్తిగా చమురు కంపెనీల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ విషయంలో ఇకపై ప్రభుత్వ జోక్యం ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇక నుంచి డీజిల్ ధరను పెంచాలా లేదా తగ్గించాలా అనే నిర్ణయం చమురు కంపెనీలే తీసుకుంటాయన్నమాట.


Click it and Unblock the Notifications








