ఏప్రిల్ 2014లో 10 శాతం క్షీణించిన ప్యాసింజర్ కార్ సేల్స్
గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 10.15 శాతం తగ్గి 135,433 యూనిట్లకు పరిమితమయ్యాయి. అందుకు ముందు సంవత్సరం ఇదే సమయానికి ఈ అమ్మకాలు150,737 యూనిట్లుగా ఉన్నట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఓ ప్రకటనలో తెలిపింది. ఒక ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏప్రిల్ 2014 నెలలోనే కార్ల అమ్మకాలు అధికంగా క్షీణించాయని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ వెల్లడించారు.
స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ, డిమాండ్ పుంజుకోలేదని ఫలితంగా కార్ల అమ్మకాలు క్షీణించాయని వివరించారు. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, ఇంధనం ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని, ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ అమ్మకాలు పుంజుకోలేదని, ప్రతికూల సెంటిమెంట్ నుంచి బయటపడలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఇదే సమయంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు మాత్రం 8.06 శాతం వృద్ధి చెంది 911,908 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 843,909 యూనిట్లుగా నమోదయ్యాయని సియామ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా.. మొత్తం ద్విచక్ర వాహనాల (స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు కలిపి) విషయానికి వస్తే, ఏప్రిల్ 2014 నెలలో వీటి అమ్మకాలు 11.67 పెరిగి 13,04,447 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఏప్రిల్ 2013లో ఇవి 11,68,100 యూనిట్లుగా ఉన్నట్లు సియామ్ పేర్కొంది. ఇక ఇదే సమయంలో వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, అవి 24 శాతం క్షీణించి 43,080 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్నీ విభాగాలకు చెందిన వాహనాల విక్రయాలు మాత్రం 6.96 శాతం వృద్ధి చెంది 14,67,472 యూనిట్ల నుంచి 15,96,670 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








