ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ ధరలో రూ.26,000 తగ్గింపు!
ఫోర్డ్ ఇండియా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఈకోస్పోర్ట్' ధర భారీగా తగ్గింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంత బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, ఫోర్డ్ ఇండియా తమ ఈకోస్పోర్ట్, ఫిగో, క్లాసిక్, ఫియస్టా మరియు ఎండీవర్ మోడళ్ల ధరలను 3 శాతం నుంచి 6 శాతం వరకు తగ్గించింది.
తాజా తగ్గింపు అనంతరం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర వేరియంట్‌ను బట్టి రూ.25,947 వరకు తగ్గింది. ఈ ధరల తగ్గింపు తర్వాత ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రారంభ ధర రూ.6.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కి చేరుకుంది. ఈకోస్పోర్ట్ ధరతో పాటుగా ఫిగో ధర రూ.23,339, క్లాసిక్ ధర రూ.24,056, ఫోర్డ్ ఫియస్టా ధర రూ.32,961 మరియు ఎండీవర్ ధర రూ.1,06,753 వరకు తగ్గాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి దీని ధర పెరగటమే కానీ తగ్గటం జరగలేదు. ఈకోస్పోర్ట్ ధర తగ్గటం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటికే ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో, తాజాగా ధర తగ్గింపు వలన ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
ఇదిలా ఉండగా.. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను, ఫోర్డ్ ఇండియా తమ చెన్నై ప్లాంట్‌లో 24 గంటల పాటు ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ద్వితీయార్థం (జులై 2014) నుంచి చెన్నై ప్లాంటులో మూడు షిఫ్టులను ప్రారంభిచనున్నారు. భారత్‌లో ఫోర్డ్ 17 ఏళ్ల చరిత్రలో 24 గంటల పాటు ఉత్పత్తిని నిర్వహించడం ఇదే మొదటిసారి కానుంది.

ఫోర్డ్ ప్రస్తుతం రోజుకు 350 ఈకోస్పోర్ట్ వాహనాలను తయారు చేస్తోంది. జూన్ నాటికి ఈ సంఖ్యను రోజుకు 450 యూనిట్లకు తీసుకువెళ్లేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అలాగే, యూరప్ మరియు జపాన్ దేశాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే అక్టోబర్ నాటికి రోజుకు 750 నుంచి 850 యూనిట్ల ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








