ఫెరారీ ఎఫ్60అమెరికా స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ
ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ ఫెరారీ, అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించి 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ప్రత్యేక ఎడిషన్ ఫెరారీ కారును తయారు చేసింది. ఫెరారీ ఎఫ్60అమెరికా (Ferrari F60America) పేరుతో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను పరిచయం చేసింది.
కేవలం 10 యూనిట్ల ఫెరారీ ఎఫ్60అమెరికా కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా నుంచి గ్రహించిన వి12 ఇంజన్‌ను ఈ కారులో ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 729 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్ట్స్ కారు కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల (62 ఎమ్‌పిహెచ్) వేగాన్ని చేరుకోగలదు.

ఫెరారీ ఎఫ్60అమెరికా కారుకి రూఫ్ (పైకప్పు) ఉండదు, కానీ లైట్ ఫ్యాబ్రిక్ (బట్టతో తయారు చేసిన) రూఫ్ మాత్రం ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ రూఫ్‌ని ఆన్ చేసుకొని డ్రైవ్ చేసేటప్పుడు కారు గరిష్ట వేగం ఆటోమేటిక్‌గా గంటకు 120 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. అంటే, కారును మరింత వేగంగా నడపాలంటే, ఈ ఫ్యాబ్రిక్ రూఫ్‌ని ఉపయోగించకూడదన్నమాట.

ఇదొక టూ సీటర్ స్పోర్ట్స్ కార్. దీని ఇంటీరియర్‌లో డ్రైవర్ సైడ్ భాగాన్ని రెడ్ కలర్‌లోను, ప్యాసింజర్ సైడ్ భాగాన్ని బ్లాక్ కలర్‌లోను డిజైన్ చేశారు. ఈ కారు నిర్మాణంలో ఎక్కువగా కార్బన్ ఫైబర్, ప్రీమియం లెథర్‌ను ఉపయోగించారు. ఈ కారు సీట్స్ మధ్య భాగంలో (బ్యాక్‌రెస్ట్‌పై) అమెరికా జాతీయ జెండా ఉంటుంది.

ఫెరారీ ఎఫ్60అమెరికా కార్లన్నీ బ్లూ కలర్‌లోనే లభ్యం కానున్నాయి. ఈ కారు ముందువైపు వైట్ కలర్ బాడీ గ్రాఫిక్స్ ఉంటుంది. ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫెరారీ సాంప్రదాయ 'నార్త్ అమెరికన్ రేసింగ్ టీమ్' థీమ్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇప్పటికే ఈ 10 యూనిట్ల ఫెరారీ ఎఫ్60అమెరికా కార్లు అమెరికాలోని కార్ కలెక్టర్లు (కార్లను కలెక్ట్ చేసే వాళ్లు) బుక్ చేసేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








