ఇదే చివరి మారుతి 800: ఉత్పత్తి నిలిపివేత, అందుబాటులో స్పేర్ పార్ట్స్
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన చిట్టచివరి 'మారుతి 800' కారు. మధ్య తరగతి ప్రజల కలల కారుగానే కాకుండా భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్న కారు ఉత్పత్తిని కంపెనీ శాస్వతంగా నిలిపివేసింది. జనవరి 18, 2014వ తేదీన ఈ చిట్టచివరి ఫైర్‌బ్రిక్ రెడ్ కలర్ ఎమ్800 కారును గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేసింది.
మొట్టమొదటి మారుతి 800 కారును 1983వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని ఓ జంటకు డెలివరీ చేశారు. ఈ 31 ఏళ్ల మారుతి 800 ప్రయాణంలో ఈ కారు సుమారు 25 లక్షల మందికి పైగా వినియోగదారుల ముఖాలపై చిరునవ్వులను చిందించేలా చేసింది. రూప లావణ్యాల పరంగా మారుతి 800 ఈ 3 దశాబ్ధాల కాలంగా ఎన్నో మార్పులు పొందినప్పటికీ, ఇంజన్ పరంగా మరియు కాలుష్య నిబంధనల పరంగా మాత్రం అప్‌గ్రేడ్ కాలేకపోయింది. మారుతి 800 మార్కెట్ నుంచి తొలగిపోవటానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం.

దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్య నిబంధనలను మార్పు చేయటం, బిఎస్-4 నిబంధనలు అమల్లోకి తీసుకురావటంతో 13 నగరాల నుంచి మారుతి 800 తొలగిపోవాల్సి వచ్చింది. కాగా.. మారుతి 800 మోడల్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినప్పటికీ, నిబంధనల ప్రకారం ఈ కారు విడిభాగాలు మరో 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అందుబాటులో ఉంచుతామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








