ఫోర్డ్ ఈకోబూస్ట్‌కు వరుసగా 3వ సారి ఇంజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ రూపొందించిన అధునాతన పెట్రోల్ ఇంజన్ 'ఫోర్డ్ ఈకోబూస్ట్' వరుసగా 3వ సారి కూడా ఇంజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఇంజన్ ఇప్పటికే 2012, 2013 సంవత్సరాలకు గాను వరుసగా రెండు సార్లు ఈ అవార్డును సొంతం చేసుకోగా, తాజాగా 2014వ సంవత్సరానికి కూడా ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజనే ఈ అవార్డును సొంతం చేసుకోవటం విశేషం.
ఫోర్డ్ అందిస్తున్న ఈ 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. ఈ 1.0 లీటర్ ఈకోబూట్స్, 3-సిలిండర్ కాంపాక్ట్ పెట్రోల్ ఇంజన్ అమర్చిన కార్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా, ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, సాటిలేని పెర్ఫామెన్స్‌నను, తిరుగులేని మైలేజ్‌ను ఆఫర్ చేస్తుండటమే.
ప్రస్తుతం ఫోర్డ్ విక్రయిస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా (టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే) మరియు కంపెనీ ఇటీవలే ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసిన 2014 ఫియస్టా సెడాన్‌లోను ఈ 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. అతి తక్కువ సమయంలో ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్ అత్యంత ప్రాచుర్యాన్ని పొందటానికి గల కారణాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..!
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు సంబంధించిన విశిష్టతలను తెలుసుకోండి.

పెర్ఫామెన్స్
ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 123 హార్స్ పవర్‌ల శక్తిని, 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పోల్చుకుంటే ఈ పెర్ఫామెన్స్ అనేక రెట్లు అధికం.

లైట్ వెయిట్, కాంపాక్ట్ డిజైన్
ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, తేలిక బరువును కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది కారులో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించదు మరియు దీని తేలికపాటి నిర్మాణం వలన ఇది వాహన బరువను తగ్గించడంలో ఉపయోగపడి, మైలేజ్ పెరిగేందుకు దోహదపడుతుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
ఫోర్డ్ ఇటీవల విడుదల చేసిన ఈకోస్పోర్ట్‌లో కూడా ఈ 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

ఫోర్డ్ ఫియస్టా 2014
ఫోర్డ్ ఇటీవల మలేషియా మార్కెట్లో విడుదల చేసిన 2014 మోడల్ ఫియస్టా సెడాన్‌లో కూడా కూడా ఈ 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఫియస్టాలోని ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 125 పిఎస్‌ల శక్తిని, 1400-4500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ పవర్‌షిఫ్ట్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మైలేజ్
పోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఈ 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ గరిష్టంగా లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దేశీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, ఇది బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు.

ఎకో ఫ్రెండ్లీ ఇంజన్
ఫోర్డ్ ఈకోబూస్ట్ 1.0 లీటర్ ఇంజన్ ఇటు కస్టమర్లకు మేలు చేకూర్చడమే కాకుండా, అటు పర్యావరణానికి కూడా పెద్దగా హాని కలిగించదు. సాధారణ పెట్రోల్ కార్లలో ఉపయోగించే ఇంజన్లతో పోల్చుకుంటే, ఈకోబూస్ట్ ఇంజన్ అతి తక్కువ మోతాదులో కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తుంది. అందుకే ఈ ఇంజన్ అత్యంత పాపులర్ అయ్యింది.

20 లక్షల మార్కు
ఫోర్డ్ గడచిన సెప్టెంబర్ నెలలో ఈకోబూస్ట్ ఇంజన్ ఉత్పత్తిలో 20 లక్షల మార్కును చేరుకుంది. ఈకోబూస్ట్ ఇంజన్ ఉత్పత్తిని ప్రారంభించిన అతికొద్ది కాలంలో 20 లక్షల యూనిట్ల మార్కును చేరుకోవటం విశేషం.

మరిన్ని పవర్‌ఫుల్ ఈకోబూస్ట్ ఇంజన్స్
ఫోర్డ్ కేవలం 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌నే కాకుండా, దీని కన్నా మరింత ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్లను కూడా తయారు చేస్తుంది. అందులో 1.5 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్, 1.6 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్, 2.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ (ఫోర్డ్ ఎస్కేప్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్నారు) మరియు 3.2 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ (ఫోర్డ్ ఎప్-150 పికప్ ట్రక్కు కోసం)లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








