ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు పోటీగా రానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్
ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ జోరందుకుంది. తక్కువ ఖర్చు, ఎక్కువ స్థలం, సమర్థవంతమైన పెర్ఫామెన్స్, బడ్జెట్‌లో ఉండే మెయింటినెన్స్, మెరుగైన మైలేజ్, తక్కువ పార్కింగ్ స్థలం, స్టయిలిష్ డిజైన్లతో కూడిన కాంపాక్ట్ ఎస్‌యూవీలు కొనుగోలుదారులను మొదటిచూపులోనే ఆకట్టుకునేస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో సరికొత్త మోడళ్లు వస్తుండటంతో పోటీ కూడా బాగానే పెరిగింది.
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలు భారత మార్కెట్లోనే కాకుండా గ్లోబల్ మార్కెట్లోల మంచి విజయాన్ని సాధించాయి. ఈ జాబితాలోకి తాజాగా మరొక జర్మన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎంట్రీ ఇవ్వనుంది. జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో గ్లోబల్ వెర్షన్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు తమ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.
గడచిన సంవత్సరం జరిగిన 2012 సావ్ పాలో ఆటో షోలో కంపెనీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి రాబోతుంది. టైగన్ కాన్సెప్ట్ దశ నుంచి ప్రొడక్షన్ దశకు చేరుకోనుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

అరంగేట్రం
ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ కాన్సెప్ట్‌ను గడచిన సంవత్సరం 2012లో జరిగిన సావ్ పాలో ఆటో షోలో ఆవిష్కరించింది. ఈ షోలో టైగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచి, అనేక లక్షల మంది మది దోచుకుంది.

చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజన్స్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో ఉపయోగించిన చిన్న సైజు 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ మాదిరిగానే, ఫోక్స్‌వ్యాన్ టైగన్‌లో కూడా తక్కువ సామర్థ్యం కలిగిన 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ 3 సిలిండర్ పెట్రోల్, అలాంటిదే ఓ డీజిల్‌ను కూడా ఇందులో ఉపయోగించే ఆస్కారం ఉంది. ఇండియా, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను టార్గెట్‌గా చేసుకొని ఈ మోడల్ విడుదల కానుంది.

సిఎన్‌జి వెర్షన్
ఫోక్స్‌వ్యాన్ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సిఎన్‌జి వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ట్రాన్సిమిషన్
ఇందులో మ్యాన్యువల్, డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

ప్లాట్‌ఫామ్
ఫోక్స్‌వ్యాన్ టైగన్‌ను కూడా కంపెనీ కామన్ ప్లాట్‌ఫామ్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయనున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే, ఇది పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండే ఆస్కారం ఉంది.

తయారీ
ప్రస్తుతానకి ఫోక్స్‌వ్యాగన్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని బ్రెజిల్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ టైగన్, ఛాకన్ (మహారాష్ట్ర)లో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ టైగన్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. రష్యాలో కూడా ఉత్పత్తి కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

విడుదల సమయం
కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాన్ టైగన్ ఇప్పటికే ఉత్పత్తి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఈ మోడల్ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంపిటీషన్
ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అలాగే గ్లోబల్ మార్కెట్లలో లభ్యమవుతున్న ఫియట్ పండా ట్రెక్కింగ్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

విస్తృతంగా లోకలైజేషన్
ఫోక్స్‌వ్యాన్ టైగన్ విషయంలో కంపెనీ లోకలైజేషన్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే ఆస్కారం ఉంది. ఇలా చేయటం వలన టైగన్ ఉత్పాదక వ్యయం తగ్గి, సరసమైన ధరకే ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.

మరిన్ని ఇతర మోడళ్లు
ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌తో పాటుగా కంపెనీ మరిన్ని మోడళ్లను రానున్న రోజుల్లో భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇందులో పోలో క్రాసోవర్, అప్ హ్యాచ్‌బ్యాక్ వంటి చిన్న కార్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








