విడుదలకు సిద్ధంగా ఉన్న 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్
అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫియస్టా సెడాన్ త్వరలోనే కొత్త అవతారంలో కనిపించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన సరికొత్త ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను మరికొద్ది రోజుల్లోనే కంపెనీ దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: డాట్సన్ గో విడుదల; ధర రూ.3.12 లక్షలే!
ఈ మేరకు కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌కు సంబంధించి కొన్ని వివరాలను కూడా విడుదల చేసింది. కొత్త 2014 ఫోర్డ్ ఫిగో స్టూడియో ఫొటోలతో పాటుగా 360 డిగ్రీ వ్యూ ఆప్షన్‌ను కూడా కంపెనీ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కొత్త ఫియస్టా విడుదలకు సంబంధించి ఖచ్ఛితమైన తేదీని కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ, అతి త్వరలోనే ఇది మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. మరి ఈలోపుగా కొత్త ఫియస్టాలోని అప్‌డేట్స్ ఏంటో ఓ లుక్కేసొద్దాం రండి..!

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌లో ప్రధానంగా ఆస్టన్ మార్టిన్ లాంటి ఫ్రంట్ గ్రిల్ (ఇదివరకటి ఫియస్టాలోని బ్లాక్ ప్లాస్టిక్ గ్రిల్ స్థానంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన గ్రిల్) ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది.

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు హెడ్‌ల్యాంప్స్ కూడా ఇందులో కొత్తవిగా అనిపిస్తాయి.

హెడ్లైట్స్ గురించి ప్రస్తావిస్తే.. ఇందులోని కొత్త యూనిట్స్ కొత్త ఫియస్టాలో బెస్ట్ ఫీచర్స్‌గా చెప్పుకోవచ్చు. స్వెప్ట్ బ్యాక్ షేపులో ఉండే హెడ్‌ల్యాంప్స్, చక్కగా ఉండే దీని డిజైన్ తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది.

వెనుక వైపు గమనిస్తే, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, డిఫ్యూజర్‌తో కూడిన రియర్ బంపర్‌లు కొత్తవిగా అనిపిస్తాయి. ఇవి కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

కొత్త ఫోర్డ్ ఫియస్టా బాడీని బోరాన్ స్టీల్ అల్లాయ్‌తో తయారు చేశారు. ఇది రెగ్యులర్ స్టీల్ కన్నా నాలుగు రెట్లు ధృడంగా ఉంటుందని ఫోర్డ్ పేర్కొంది.

ఇంకా ఇందులో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను కూడా గమనించవచ్చు. బహుశా టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే ఈ స్టయిలిష్ అల్లాయ్ వీల్స్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

కొత్త 2014 ఫియస్టా ఫోర్డ్ సింక్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఈ సిస్టమ్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ ఫోన్ కాల్స్, హ్యాండ్సీ-ఫ్రీ మ్యూజిక్ ప్లేబ్యాక్, టెక్స్ట్ మెసేజ్ రీడ్-అవుట్, యాప్‌లింక్, వాయిస్ యాక్టివేటెడ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి పలు ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే ఈకోస్పోర్ట్‌లో ఆఫర్ చేస్తున్నారు.

ఇందులో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌లైట్స్ వంటి కొన్ని స్మార్ట్ ఫీచర్లు టాప్ ఎండ్ వేరియంట్ ఫియస్టాలో లభ్యం కానున్నాయి.

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టాలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 90 పిఎస్, 1.5 లీటర్, టిడిసిఐ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








