ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన కారు 'హెన్నెస్సీ వెనామ్ జిటి'
ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన కారు అనగానే మనకు టక్కు గుర్తుకు వచ్చే పేరు బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ (Bugatti Veyron Super Sport). అయితే, ఇకనుంచి ఆ పేరు వినిపించబోదు, ఎందుకంటే ఆ స్థానాన్ని మరో సరికొత్త సూపర్‌కార్ ఆక్రమించుకుంది కాబట్టి.
అవును.. అమెరికాకు చెందిన హెన్నెస్సీ వెనామ్ జిటి (Hennessey Venom GT) సూపర్‌కార్ ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన కారుగా రికార్డు సృష్టించింది. దీని గరిష్ట వేగం గంటకు 435.311 కిలోమీటర్లు (గంటకు 270.49 మైళ్లు). కాగా.. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ గరిష్ట వేగం గంటకు 430.998 కిలోమీటర్లు (గంటకు 267.81 మైళ్లు).
ఏదేమైనప్పటికీ, గిన్నిస్ బుక్ అధికారిక రికార్డుల ప్రకారం, ఉత్పత్తిలో ఉన్న అత్యంత వేగవంతమైన కారు మాత్రం బుగాటి వేరాన్ సూపర్ స్పోర్టే. ఎందుకంటే, ఈ హెన్నెస్సీ వెనామ్ జిటి రికార్డ్ అథారిటీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఇది ప్రొడక్షన్ కారుగా అర్హత పొందలేదు కాబట్టి. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ వద్ద 5.18 కి.మీ. పొడవున్న రన్‌వేపై హెన్నెస్సీ వెనామ్ జిటి గంటకు గరిష్టంగా 435.311 కి.మీ. టాప్ స్పీడ్‌ను చేరుకుంది.

హెన్నెస్సీ వెనామ్ జిటి కారును నడిపిన డ్రైవర్ బ్రియాన్ స్మిత్ కేవలం 4.18 కి.మీ. దూరంలోనే ఈ టాప్ స్పీడ్‌ను చేరుకోగలిగాడు. అయితే, ఆ తర్వాత బ్రేక్స్ అప్లయ్ చేయాల్సి రావటంతో మరో కిలోమీటరు పాటు ముందుకెళ్లిన కారు వేగం 112.6 కి.మీ. తగ్గింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏటంటే, వెనామ్ జిటి కేవలం 4.18 కి.మీ. దూరంలో ఈ గరిష్ట వేగాన్ని చేరుకోగలిగితే, ఇదే వేగాన్ని చేరుకోవటానికి బుగాటి వేరాన్‌కు 8.85 కి.మీ. దూరం పట్టింది.

రన్‌వే దూరం ఇంకొన్ని కిలోమీటర్లు పొడవు ఉండి ఉంటే, గరిష్ట వేగాన్ని మరింత పెంచే అవకాశం ఉండి ఉండేదని, హెన్నెస్సీ వెనామ్ జిటి ఇంత కన్నా ఎక్కువ వేగంతో పరుగులు తీయగలదని డ్రైవర్ బ్రియాన్ స్మిత్ తెలిపారు.

హెన్నెస్సీ వెనామ్ జిటి టాప్ స్పీడ్‌ను రేస్‌లాజిక్ విబాక్స్ టెలిమెట్రీ సిస్టమ్‌తో ధృవీకరించినప్పటికీ, ఈ ఫీట్ మాత్రం అధికారికంగా గిన్నిస్ బుక్ రికార్డులలో స్థానం దక్కించుకోలేకపోయింది.

ఇందుకు కారణాలేంటంటే..
1. వాస్తవానికి ఈ రికార్డుకు అర్హత సాధించాలంటే, కారు రెండు దిశలలో (అపోజిట్ డైరెక్షన్లలో) సాధించిన గరిష్ట వేగపు సగటును బట్టి రికార్డుకు అర్హతను లెక్కిస్తారు. (నాసా తమ రన్‌వేపై ఒక్కసారి (సింగిల్ రన్)కి మాత్రమే అనుమతినిచ్చింది).
2. హెన్నెస్సీ వెనామ్ జిటి ప్రొడక్షన్ కారుగా అర్హత సాధించాలంటే, ఇలాంటివి కనీసం 30 కార్లయినా ఉత్పత్తి అయి ఉండాలి. (హెన్నెస్సీ ఇప్పటి వరకు కేవలం 29 వెనామ్ జిటి కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది)

ఏదేమైనప్పటికీ, వెనామ్ జిటి కారుకు అధికారికంగా గుర్తింపు లభించినప్పటికీ, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారే. ఎందుకంటే, ఇది కేవలం 13.63 సెకండ్ల వ్యవధిలో 0-300 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ విషయాన్ని మాత్రం గిన్నిస్ గుర్తించింది.

హెన్నెస్సీ వెనామ్ జిటి సూపర్ కారులో జిఎమ్ నుంచి గ్రహించిన 7.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 1244 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
వీడియో
హెన్నెస్సీ వెనామ్ జిటి టాప్ స్పీడ్ రికార్డును మీరు కూడా ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








