గ్రాండ్ ఓల్డ్ లేడీ 'అంబాసిడర్' కారు శకం ముగిసింది..
భారత ఆటోమొబైల్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన మేడ్ ఇన్ ఇండియా అంబాసిడర్ కారు ఇకపై చరిత్రకే పరిమితం కానుంది. సామాన్యుడి టాక్సీగా, విఐపిల భద్రతా వాహనంగా, మధ్యతరగతి ప్రజల మనోరథంగా ఓ వెలుగు వెలిగిన హిందుస్తాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారు ఇకపై ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అవును.. ఇక ఈ కార్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నామని హిందుస్తాన్ మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో అనేక కొత్త కొత్త మోడళ్లు వస్తుండటంతో, ఈ పాత కాలపు డిజైన్ కలిగిన అంబాసిడర్ కారును కొనుగోలుచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అమ్మకాలు తగ్గిపోవటం, డిమాండ్ క్షీణించడం, రుణభారం అధికం కావటం వంటి పలు కారణాల దృష్ట్యా హిందుస్తాన్ మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అంబాసిడర్ కారుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

అంబాసిడర్ కారుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

అంబాసిడర్ తొలుత బ్రిటన్‌లో మోరిస్ ఆక్స్‌ఫర్డ్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ తర్వాత అంబాసిడర్‌గా పేరు మార్చుకొని భారత ఆటోమొబైల్/టాక్సీ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని, కొన్ని దశాబ్ధాల పాటు ప్రజలకు సేవలందించింది. సి.కె.బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందూస్తాన్ మోటార్స్ 1948లో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉత్తరపరలో అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది.

అయితే, ఈ కారును ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ చేయటంలో కంపెనీ విఫలమైంది. గడచిన 60 ఏళ్లలో ఈ కారు డిజైన్‌లో పెద్దగా మార్పులేవీ చేయకపోవడం కూడా దీని వైఫల్యానికి పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు.

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌ను మూసేశామని, ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిరవధికంగా నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కారు విషయంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయామని ఇకపై మరింత నష్టపోరాదనే ఉద్దేశ్యంతోనే, ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

అయితే, భవిష్యత్తులో కావాలనుకుంటే ఈ కారును పునరుద్దరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు హిందుస్తాన్ మోటార్స్ శనివారం నాడు బీఎస్‌ఈకి కూడా సమాచారం అందించింది. అంటే, భవిష్యత్తులో అంబాసిడర్ కారు ప్రాజెక్టు తిరిగి జీవం పోసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట.

అప్పట్లో అంబాసిడర్ కారు ఓ స్టేటస్ సింబల్‌గా ఉండేది. ఈరోజుల్లో బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్లు ఎలాగో అప్పట్లో అంబాసిడర్ అలాగ. ఇప్పటికీ అనేక మంది ప్రభుత్వాధికారులు, టాక్సీ ఓనర్లు అంబాసిడర్ కారుకే ప్రధాన్యత ఇస్తుంటారు.

'హిందూస్తాన్ 10' పేరుతో హిందుస్తాన్ మోటార్స్ తొలి అంబాసిడర్‌ను ఉత్పత్తి చేసింది. అప్పట్లో ఈ కారు కంపెనీకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆకర్షనీయమైన రూపం, పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని భద్రతలు ఈ కారును నెంబర్ వన్‌గా నిలిపాయి.

అంబాసిడర్ కారును 'కింగ్ ఆఫ్ ది ఇండియన్ రోడ్స్' (భారత రోడ్లకు రారాజుగా) అభివర్ణించేవారు. 1980 వరకూ భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ కారు అంబాసిడర్ కారే కావడం విశేషం. 2004వ సంవత్సరంలో 90,000 లకు పైగా అంబాసిడర్ కార్లు ఉత్పత్తయ్యాయి. అప్పట్లో ఇదో పెద్ద రికార్డ్.

ట్యాక్సీగా అంబాసిడర్ కారు చాలా ప్రాచుర్యం పొందింది. బిబిసికి చెందిన టాప్ గేర్ ప్రోగ్రామ్ నిర్వహించిన వరల్డ్ టాక్సీ షూటవుట్ ఓటింగ్‌లో అంబాసిడర్ 'ప్రపంచపు అత్యుత్తమ టాక్సీ'గా ఎంపికైంది. ఈ వరల్డ్ టాక్సీ షూటవుట్ ఓటింగ్‌లో బ్రిటన్, అమెరికా, జర్మనీ, దక్షిణాఫ్రికా, మెక్సికో, రష్యాల్లోని టాక్సీ కార్లన్నింటిని అధిగమించి హిందూస్తాన్ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్ టాక్సీ అగ్రస్థానాన్ని దక్కించుకోవటం విశేషం.

ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనక వైపు డ్రమ్ బ్రేక్‌లు కారణంగా ఈ కారు ప్రయాణం అత్యంత భద్రమైనది. సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన సీట్‌లు ఈ కారు ప్రత్యేకత. సంవత్సరాల తరబడి డిజైన్ అలాగే ఉన్నప్పటికీ, ఇంటీరియర్ ఇతరత్రా పలు మార్పులను అంబాసిడర్ చూసింది. డాష్‌బోర్డ్‌లు, టెయిల్ లైట్లు, పార్కింగ్ లైట్లు ఇందులో కొన్ని.

1957 నుంచి రోడ్లపై ప్రయాణం ప్రారంభించిన అంబాసిడర్ జీవితకాలంలో మోరిస్ ఆక్స్‌ఫర్డ్ నుంచి ఇటీవలే విడుదలైన అంబాసిడర్ ఎన్‌కోర్ వరకూ అనేక మోడళ్లు వచ్చాయి.

ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ చాబ్రియా తాజా పరిణామాలపై స్పందిస్తూ గత 60 సంవత్సరాల నుంచి కారులో ఎలాంటి మార్పు చేయకుండా కొనసాగించి ఉంటే ఇది భారత్ రోల్స్‌రాయిస్‌గా నిలిచిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంబాసిడర్ కారును దిలీప్ చాబ్రిబాయ తనదైన శైలిలో కస్టమైజ్ కూడా చేశారు. దానిని ఈ ఫొటోలో చూడొచ్చు.


Click it and Unblock the Notifications








