చైనా మార్కెట్లో విడుదలైన హోండా క్రైడర్ సెడాన్
జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ ఇటీవలే చైనాలో జరిగిన 2013 షాంగై ఆటో షోలో ఆవిష్కరించిన హోండా క్రైడర్ (Honda Crider) సెడాన్ ఇప్పుడు అక్కడి మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. చైనా మార్కెట్లో హోండా అందిస్తున్న అకార్డ్, సివిక్ సెడాన్లకు మధ్యలో క్రైడర్‌ను ప్రవేశపెట్టనున్నారు. క్రైటీరియా, డ్రీమ్స్ అనే పదాల నుంచి క్రైడర్ అనే పేరును గ్రహించి ఈ కారుకు పెట్టడం జరిగింది.
హోండా క్రైడర్ సెడాన్‌లో 1.8 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 139 హార్స్ పవర్‌ల శక్తిని, 172 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 15.34 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 14.92 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
చైనాలో హోండా క్రైడర్ కారు ప్రారంభ ధర 1,14,800 యవాన్‌లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.11.24 లక్షలు). ఇది పూర్తిగా చైనాలో తయారైన కారు. ఆకర్షనీయమైన డిజైన్, పెద్ద క్రోమ్ గ్రిల్, బ్లూ బెజెల్ హెడ్‌లైట్స్, హెడ్‌లైట్స్‌కు పైన, క్రింద ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్స్‌తో ఇది కంపెనీ అందిస్తున్న ప్రీమియం బ్రాండ్ ఆక్యురా ఫీల్‌ను ఇస్తుంది. హోండా గతంలో ఆవిష్కరించిన కాన్సెప్ట్ సి డిజైన్ క్యూలను ఈ కారులో గమనించవచ్చు.
త్వరలోనే హోండా క్రైడర్ జపాన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఇండియాకు కూడా రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మోడల్ రాకపోయినప్పటికీ, దీని డిజైన్ ఆధారంగా చేసుకొని కొత్త 2014 హోండా సిటీ సెడాన్‌ను అభివృద్ధి చేయవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. కొత్త 2014 హోండా సిటీ సెడాన్ డీజిల్ వెర్షన్‌లో కూడా కావచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి..!











Click it and Unblock the Notifications








